వామ్మో.. వీరబాదుడు... ట్రక్కు డ్రైవర్‌కు దేశంలోనే అత్యధిక అపరాధం

సోమవారం, 9 సెప్టెంబరు 2019 (11:17 IST)
దేశవ్యాప్తంగా కొత్త మోటారు వాహన చట్టం సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ట్రాఫిక్ పోలీసులు ఇష్టానుసారంగా తనిఖీలు చేస్తూ వాహనచోదకులను బెంబేలెత్తిస్తున్నారు. పైగా, కొత్త చట్టం మేరకు అపరాధం రుసుం వసూలు చేస్తున్నారు. దీంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే వాహనం ఖరీదు కంటే అధిక మొత్తంలో జరిమానా విధించిన ఘటనలూ వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు విధించిన అపరాధ రుసుం చెల్లించలేక వాహనాలను వదిలివేయడం లేదా కాల్చేయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. 
 
తాజాగా ఒడిషా రాష్ట్రంలోని సంబల్‌పూర్‌ జిల్లాలో అశోక్‌ జాదవ్‌ అనే ట్రక్కు డ్రైవర్‌కు ట్రాఫిక్‌ పోలీసులు రూ.86,500 జరిమానా విధించారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక దేశవ్యాప్తంగా విధించిన జరిమానాల్లో ఇదే అత్యధికం. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడంతో పాటు పరిమితికి మించి లోడు తీసుకెళ్లడం, ఇతర ఉల్లంఘనల కారణంగా సెప్టెంబరు 3వ తేదీన ఈ జరిమానాను విధించారు. అంత కట్టలేనని డ్రైవర్‌ దాదాపు ఐదు గంటలు వేడుకోగా రూ.70,000కు తగ్గించారు. అయితే ఇప్పుడా చలానా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు