అడ్డగోలు విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కమలనాథులు చేసిన వాగ్దానమే ఇపుడు వారి కొంపను కొల్లేరు చేసేలా కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల అవసరాలు తీర్చుతామని నమ్మబలికి వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకొని బీజేపీ అధికారంలోకి వచ్చింది.
ఈ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించినప్పటికీ.. మిత్రధర్మాన్ని అనుసరించి, భాగస్వామ్య పక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించారు. అయితే, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మరో యేడాది సమయం ఉన్న నేపథ్యంలో అవే ప్రాంతీయ పార్టీలతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
ఎన్డీయే కూటమిలోని ఉన్న అన్ని భాగస్వామ్య పార్టీలు గుడ్‌బై చెప్పి, వచ్చే 2019 ఎన్నికల సమయానికి ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతే ఎన్డీయేకు గడ్డుకాలమేనని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఆది నుంచి పెద్ద పట్టులేదు. కాకపోతే వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిన కూడా పాగా వేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ పావులు కదిపింది. అందుకు తగ్గట్లుగానే ఏపీలో సీఎం చంద్రబాబును, తెలంగాణలో కేసీఆర్‌ను దూరం చేసుకోకుండా ఇంతవరకు నెట్టుకొచ్చింది.
కానీ గతవారం రోజులుగా అటు ఢిల్లీ, ఇటు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రత్యేకహోదాకు కేంద్రం తలొగ్గకపోవడంతో పాటు తెలంగాణకు ఇచ్చిన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేదు. దీంతో టీడీపీతో పాటు తెరాస కూడా బీజేపీపై విరుచుకుపడుతోంది.
మిత్రధర్మాన్ని పాటించడంలో ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. అంతేనా, నమ్ముకున్న పార్టీలను, ప్రజలకు కమలనాథులు నమ్మకద్రోహం చేశారనే విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు బీజేపీ నేతలు చేసిన వాగ్దానమే ఇపుడు కమలనాథుల మెడకు బలంగా చుట్టుకునేలా కనిపిస్తోంది.