ఆర్టీసీ కార్మికులు తిన్నది అరగక సమ్మె చేస్తున్నారు .. ఆర్టీసీ కథ ముగుస్తుంది : కేసీఆర్

గురువారం, 24 అక్టోబరు 2019 (16:59 IST)
ఆర్టీసీ కార్మికులు తిన్నది అరగక సమ్మె చేస్తున్నారనీ, వారు తక్షణం సమ్మె విరమించకపోతే.. ఆర్టీసీ కథ త్వరలోనే ముగుస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. హుజూర్‌నగర్ ఉపఎన్నిక విజయం అనంతరం సీఎం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి అఖండ మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని అందించినటువంటి హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
 
అలాగే, గత కొన్ని రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఆయన మాట్లాడారు. ఆర్టీసీ గురించి తనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదన్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడేళ్లపాటు రవాణాశాఖ మంత్రిగా పని చేశానని, ఆ సమయంలో 13 కోట్ల రూపాయల నష్టంలో ఉన్న ఆర్టీసీని యేడాది తిరిగేలోపు 14 కోట్ల రూపాయల మేరకు లాభాల బాటలోకి మళ్లించినట్టు తెలిపారు. 
 
ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించలేనన్నారు. పైగా, ఆర్థిక మాంద్యం దృష్ట్యా ఆర్థికాభివృద్ధి రెండు శాతానికి పడిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని విషయాలను ప్రజలకు ఎప్పటికపుడు తెలుపుతూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నట్టు తెలిపారు. 
 
మరో రెండు మూడు నెలల్లో యూనియన్ ఎన్నికలు జరుగనున్నాయనీ, ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు అర్థరహితంగా, తిన్నది అరగక సమ్మె చేస్తున్నారన్నారు. ఈ సమ్మెను తక్షణం ముగించకుంటే ఆర్టీసీ కథే ముగుస్తుందని హెచ్చరించారు. పైగా, కార్మికుల సమస్య పరిష్కారం కోసం కమిటీ వేస్తే ఎంత కాలం తీసుకుంటారంటూ లంగా ప్రచారం చేశారనీ, వీరితో కొన్ని రాజకీయ పార్టీలు కలిసి యాగీ చేస్తున్నాయని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానమని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు