కర్నాటక భాజపాకి మంచికాలం వచ్చేసినట్లే కనిపిస్తోంది. త్వరలో యడ్యూరప్ప ఆశ నెరవేరబోతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది...? తాజా సమాచారాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి భాజపాలో చేరేందుకు సిద్ధంగా వున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనితో అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఏ క్షణానైనా కూలిపోతుందని చెపుతున్నారు.
ఫలితంగా 13 నెలల కర్నాటక సంకీర్ణ ప్రభుత్వానికి కాలం చెల్లిపోవచ్చు. ఇదంతా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితమేనంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలను పాతాళానికి తొక్కేసింది బీజేపీ. అక్కడ మొత్తం 28 ఎంపీ స్థానాలకు గానూ 25 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దీనితో ఇక కాంగ్రెస్-జేడీఎస్ పనైపోయినట్లేనని అప్పట్లోనే చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు అది నిజం కాబోతున్నట్లు అర్థమవుతుంది.