తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై కావేరి ఆస్పత్రి ఆదివారం ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. కరుణ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనకు నిరంతరం వైద్య సహాయం అందిస్తున్నామని పేర్కొంది. ఐసీయూలో ఆయనకు వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోందని తెలిపింది.
కాగా, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కరుణానిధి ఆరోగ్యం శుక్రవారం అర్థరాత్రి దాటాక విషమించడంతో, స్థానిక ఆళ్వారుపేటలోని కావేరి ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. పూర్తిగా పల్స్ పడిపోయిన స్థితిలో ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు అందించిన చికిత్సతో కరుణ కొంత కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
కరుణ ఆరోగ్యంపై ఆందోళన చెందిన వేలాదిమంది కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు, ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వారిని కలవడానికి బయటకు వచ్చినప్పుడు స్టాలిన్ అదుపు చేసుకోలేక ఒక్కపెట్టున రోదించారు. ఇకపోతే, ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న ఉద్దేశంతో పోలీస్ శాఖ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.
ఆస్పత్రి వద్ద 2 వేల మందితో భద్ర త ఏర్పాటు చేశారు. కరుణ ఆరోగ్యం నిలకడగా ఉందని కావేరి ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కరుణ ఆరోగ్యం విషమించిందన్న వార్తలతో శివషణ్ముగం(64), తమీ మ్(55) అనే ఇద్దరు గుండెపోటుతో మరణించారు.