హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పరిధి సత్యనారాయణపురంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మానసిక వికలాంగులైన కవల పిల్లలను సొంత మేనమామే హతమార్చాడు. చిన్నారులను చంపికారులో తరలిస్తుండగా ఇంటి యజమాని గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సహకారంతో నిందితుడిని పోలీసులకు అప్పగించారు. మృతిచెందిన కవలలు సృజన రెడ్డి(12), విష్ణువర్దన్ రెడ్డి(12)లది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ.
దీనిపై మృతుల తండ్రి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, తన ఇద్దరు పిల్లలను చంపిన బామ్మర్ది చాలా మంచోడనీ, అందువల్ల ఆయనపై కేసు పెట్టబోమని స్పష్టంచేశాడు. తమ బిడ్డలను చంపిన విషయాన్ని తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి, ఆయన భార్య లక్ష్మిలు చైతన్యపురి పోలీస్టేషన్‌కు వచ్చారు. తమ పిల్లల హత్య వెనుక ఎలాంటి కుట్రలేదని, తన బావమరిదితో ఎలాంటి గొడవలూ లేవని శ్రీనివాస్‌రెడ్డి మీడియాముందు చెప్పారు.
హత్య చేసిన మల్లిఖార్జున్‌రెడ్డిపై పిల్లల తల్లిదండ్రులు కేసు పెట్టక పోవడం గమనర్హాం. పైగా జరిగిందేదో జరిగింది.. పోయిన ప్రాణాలు తిరిగిరావని, తన తమ్మున్ని వదిలిపెట్టాల్సిందిగా లక్ష్మి పోలీసులను కోరింది. లక్ష్మి తీరును గమనిస్తే ఆమెకు హత్య చేసే విషయం తెలుసన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. రపైగా, అక్క అనుమతితోనే మల్లిఖార్జున్ రెడ్డి పిల్లలను హైదరాబాదుకు తీసుకువచ్చి హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు, ఈ హత్యలపై ఏసీపీ పృథ్వీధర్‌రావు మాట్లాడుతూ, చిన్నారులను మేనమామ మల్లికార్జునరెడ్డి గొంతు నులిమి, దిండుతో శ్వాస ఆడకుండా చేసి చంపాడని తెలిపారు. కూల్ డ్రింక్‌లో హార్పిక్ కలుపుకుని తాగారంటూ నమ్మించేందుకు మల్లికార్జున రెడ్డి ప్రయత్నించారని చెప్పారు. అలాగే, స్నేహితుడు వివేక్ రెడ్డి కారులో మృతదేహాలను తరలించేందుకు ప్రయత్నించాడని, ఇంటి యజమాని ఫిర్యాదుతో వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మల్లికార్జున్ రెడ్డి, వివేక్ రెడ్డిపై కేసులు నమోదు చేశామని ఏసీపీ పృథ్వీధర్‌రావు తెలిపారు.