ద్రవిడ సిద్ధాంత కర్త ముత్తువేల్ కరుణానిధి ఇకలేరు. ఆయన వృద్దాప్యం కారణంగా కన్నుమూశారు. ఆయన వయసు 95 యేళ్లు. ఈ తమిళ సూరీడు నిజానికి తెలుగు బిడ్డే. అసలు పేరు దక్షిణామూర్తి. కానీ, ఆయన తన పేరును కరుణానిధిగా మార్చుకున్నారు. ఆ పేరును ఎందుకు మార్చుకున్నారో తెలుసుకుందాం.
మహాదేవుడైన పరమశివుడి రూపాల్లో ఒకటి దక్షిణామూర్తి. హిందువులు దక్షిణామూర్తిని ఆది గురువుగా ఆరాధిస్తారు. కరుణానిధికి తల్లిదండ్రులు పెట్టిన పేరు దక్షిణామూర్తి. అప్పుడు వారు ఊహించి ఉండరు... తర్వాతి కాలంలో ఆయన దక్షిణ భారతంలో ప్రభంజనం సృష్టిస్తారని. రాజకీయ, కళా సాంస్కృతిక రంగాల్లో అసమాన ప్రతిభా పాటవాలతో చెరగని ముద్ర వేస్తారని.
కరుణానిధి ఇసై వెల్లలార్ (నాయీ బ్రాహ్మణ) సామాజికవర్గానికి చెందినవారు. ఆయన తండ్రి ఆలయంలో నాదస్వరం, మృదంగం వాయించేవారు. చిన్నతనంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు కరుణానిధిని అణచివేతకు గురవుతున్న కులాల పక్షాన నిలిచేలా చేశాయి. చిన్న వయసులోనే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో ఆయన సభ్యుడయ్యారు.