ధర్మశాల అసెంబ్లీ గేటుకు ఖలిస్థాన్ జెండాలు

సోమవారం, 9 మే 2022 (10:42 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలోని రాష్ట్ర అసెంబ్లీ గేటుకు ఖలిస్థాన్ జెండాలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ సోమీడియాలో, జాతీయ టీవీల్లో ప్రసారం కావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. 
 
శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు అసెంబ్లీ గేట్లకు ఖలిస్థాన్ జెండాలను కట్టినట్టు సమాచారం. ధర్మశాలలోని అసెంబ్లీ ప్రధాన గేటుకి అలాగే, గోడలపై దుండగులు ఆ జెండాల‌ను ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. 
 
ఆదివారం ఉదయం వాటిని గుర్తించిన అనంత‌రం పోలీసులు వాటిని తొలగించారు. విధాన సభ గేటుకు ఉన్న ఖలిస్థాన్‌ జెండాలను తొలగించామని పోలీసులు మీడియాకు తెలిపారు. పంజాబ్‌ నుంచి వచ్చిన వేర్పాటు వాదులు ఈ దుస్సాహ‌సానికి వ‌డిగట్టి ఉంటార‌ని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
ఈ బ్యానర్ల వ్యవహారం పక్కన పెడితే, హిమాచల్ ప్రదేశ్ విధానసభ ప్రధాన ద్వారం పక్కన ఉన్న గోడపై ఖలిస్తాన్ అని ఆకుపచ్చ రంగులో రాసి ఉంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ఈ ఘటనను ఖండించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
 
'ధర్మశాల అసెంబ్లీ కాంప్లెక్స్ ప్రవేశద్వారం వద్ద అర్ధరాత్రి ఖలిస్తాన్ జెండాలను ఎగురవేయడం పిరికిపంద చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను'. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మాత్రమే అక్కడ జరుగుతాయి, పటిష్ట భద్రతా జాగ్రత్తలు అవసరం' అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 
 
ఈ కేసుకు సంబంధించి నిషేధిత ఖలిస్థాన్ తీవ్రవాద సంస్థ నేత గుర్పత్వాంత్ సింగ్ పున్నున‌పై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడినందుకు ఈ సారథ్యంలోని సంస్థపై గత 2019 నుంచి నిషేధం విధించారు. ఇపుడు అసెంబ్లీ గేటుకు ఖలిస్థాన్ జెండాలు కనిపించడం వెనుక ఆయన కుట్ర ఉందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు