కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ముఖ్యంగా, కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందితో పాటు... లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్న పోలీసులు, పారిశుద్ధ్యం కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు కరోనా వైరస్ ఎక్కడ సోకుంతుందోనన్న భయంతో వారు విధులు నిర్వహిస్తున్నారు.
అయినప్పటికీ అక్కడక్కడా పోలీసులకు, వైద్యులు, నర్సులకు ఈ వైరస్ సోకుతూనే వుంది. తాజాగా కరోనా వైరస్ సోకి అసిస్టెంట్ పోలీస్ కమిషనరు ఒకరు తుదిశ్వాస విడిచారు. ఈ విషాదకర సంఘటన లుథియానాలో జరిగింది. ఈ మృతితో పంజాబ్‌లో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 16కు చేరింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లూథియానా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) అనిల్ కుమార్ కోహ్లీ (59) పని చేస్తున్నారు. ఈయనకు ఈ నెల 13వ తేదీన కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన్ను స్థానిక ఎస్‌పీఎస్ ఆసుపత్రిలో చేర్రి చికిత్స అందిస్తూ వచ్చారు.
కానీ చికిత్స ఫలించక శనివారం తుదిశ్వాస విడిచారు. అనిల్ కోహ్లీ మృతిపై పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా సంతాపం తెలిపారు. దీనిపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "మా సోదర అధికారి, లూథియానా ఏసీపీ అనిల్ కోహ్లీ కోవిడ్-19పై చివరి వరకూ పోరాటం చేసి శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. పంజాబ్ పోలీసు శాఖకు, ప్రజలకు 30 ఏళ్ల పాటు అనిల్ సేవలు అందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు స్వాంతన కలగాలని ప్రార్థిస్తున్నా" అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.