శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నుంచి ఆహ్వానం అందింది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కోరారు. అలాగే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారం రోజుల్లో అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోవాలని కోరారు. ఈ మేరకు ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ నుంచి ఓ లేఖ వచ్చింది.
దీంతో గవర్నర్ కోరిక మేరకు ఉద్ధవ్ ఠాక్రే గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై, దాదర్‌లోని శివాజీ పార్కులో ఈ ప్రమాణ స్వీకార వేడుకలు జరుగనున్నాయి. అయితే, ఉద్ధవ్ ఇపుడు ఏ సభలోనూ సభ్యుడు కాదు. అందువల్ల ఆయన ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సివుంటుంది.
మరోవైపు, తన భార్య రష్మీతో కలిసి బుధవారం ఉద్ధవ్ ఠాక్రే... మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో సమావేశమైన విషయం తెలిసిందే. గవర్నర్‌తో ఉద్ధవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని శివసేన నేతలు అంటున్నారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో రేపు సాయంత్రం 6.40 గంటలకు దాదర్‌లోని శివాజీపార్క్‌లో ఉద్ధవ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.