'మహా' ఉత్కంఠత : వీడని ప్రతిష్టంభన... గవర్నర్‌ కోర్టులో అధికార పీఠం!

శుక్రవారం, 8 నవంబరు 2019 (09:08 IST)
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభన ఏమాత్రం వీడలేదు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న గడువు శనివారంతో ముగియనుంది. ఈ గడువు పూర్తయితే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయి. 
 
కాగా, గత నెల 21వ తేదీన వెల్లడైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ - శివసేన కూటమి విజయభేరీ మోగించింది. అయితే, అధికారాన్ని తలా రెండున్నరేళ్లు పంచుకోవాలన్న డిమాండ్‌ను శివసేన తెరపైకి తెచ్చింది. దీనికి బీజేపీ ససేమిరా అంటోంది. అటు శివసేన కూడా పట్టువిడవడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ రంగంలోకి దిగారు. గురువారం ముగ్గురు న్యాయ నిపుణులను పిలిపించి మాట్లాడారు. రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌, న్యాయ నిపుణుడు అశుతోశ్‌ కుంభకర్ణి గవర్నర్‌ను కలిశారు.
 
ఒకవేళ ఏ పక్షమూ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించని పక్షంలో తాత్కాలికంగా ఆపధ్ధర్మ ముఖ్యమంత్రిని నియమించే సాధ్యాసాధ్యాలను గవర్నర్‌ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికిప్పుడు రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అవకాశం లేదని రాజ్‌భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో ప్రస్తుత శాసనసభ పదవీకాలం ఈనెల 9వ తేదీతో ముగుస్తోంది. ఆలోగా ప్రభుత్వం ఏర్పడని పక్షంలో- ప్రస్తుత సర్కార్‌ను అధికారికంగా పొడిగించాల్సిన అవసరం లేకుండానే- కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా ఆపద్ధర్మంగా కొనసాగించే వీలుందని న్యాయనిపుణులు సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో కొద్దిరోజుల పాటు దేవేంద్ర ఫడణవీసే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతారని అంటున్నారు.
 
అయితే శుక్రవారం గనక చకచకా నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటే ఈ అవసరం పడదు. ఎక్కువ స్థానాలు గెలిచిన అతి పెద్ద పార్టీని కూడా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించే వెసులుబాటు కూడా రాజ్యాంగంలో ఉందనీ, ఒకవేళ ఆ పార్టీ అనాసక్తి ప్రదర్శిస్తే రెండో పెద్ద పార్టీని పిలవవచ్చని మరో రాజ్యాంగ నిపుణుడు అనంత్‌ కాల్సే చెప్పారు.
 
మరోవైపు, బీజేపీ తమ పార్టీని చీల్చవచ్చన్న భయాందోళనలతో శివసేన తమ ఎమ్మెల్యేలందరినీ రంగ్‌శారద అనే ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు తరలించింది. రెండు మిత్రపక్షాల మధ్య సయోధ్య కుదరని విషయం ఈ క్యాంపు రాజకీయం తేటతెల్లం చేస్తోంది. గురువారం ఉదయం ఉద్ధవ్‌ ఠాక్రే నివాసంలో సేన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. నిర్ణయాధికారాన్ని వారు ఉద్ధవ్‌కు అప్పగిస్తూ తీర్మానం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు