పల్టీకొట్టిన శివసేన - అన్నాడీఎంకే.. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు

గురువారం, 19 జులై 2018 (15:31 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై కారాలుమిరియాలు నూరుతూ వచ్చిన ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శివసేన ఇపుడు పల్టీ కొట్టింది. మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసేలా నిర్ణయం తీసుకుంది. దీనిపై గురువారం సాయంత్రం అధికారిక ప్రకటన చేయనుంది.
 
లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు ఆమోదం పొందగానే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగి మిత్రపక్షాలను బుజ్జగించే పనిలో పడినట్టు తెలిసింది. అందులో భాగంగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేతో ఫోన్లో మాట్లాడి అవిశ్వాసానికి వ్యతిరేకంగా సేన ఓటేసేలా ఆయనను ఒప్పించినట్టు సమాచారం. అయితే అవిశ్వాసంపై తమ వైఖరి సభలోనే స్పష్టం చేస్తామని సేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. దీనిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు ఆయన చెప్పారు.
 
మరోవైపు, అన్నాడీఎంకే కూడా మోడీ సర్కారుకు బాసటగానే నిలువనుంది. తెలుగుదేశం పార్టీకి ముఖం చాటేసింది. కేంద్రంలోని బీజేపీ కూటమికి అనుకూలంగానే తాము ఓటు వేస్తామని స్పష్టం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మానం తాము తీసుకురాలేదని చెప్పారు.
 
'అది పూర్తిగా ఆంధ్ర అంశం. వారే దాన్ని (అవిశ్వాస తీర్మానం) తీసుకువచ్చారు. కావేరీ వాటర్ మేనేజిమెంట్ బోర్డు అంశంపై పార్లమెంటులో 22 రోజుల పాటు తమిళనాడు పోరాడింది. అప్పుడు మా ఎంపీలకు ఎవరు అండగా నిలబడ్డారు? మా సమస్యకు మద్దతుగా ఏ రాష్ట్రం ముందుకు వచ్చింది?' అంటూ ప్రశ్నించారు. కాగా, అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతిస్తున్నట్టు తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు