రొటీన్‌కు భిన్నంగా 'ఈ నగరానికి ఏమైంది' : మూవీ రివ్యూ(Video)

శుక్రవారం, 29 జూన్ 2018 (12:04 IST)
చిత్రం : ఈ నగరానికి ఏమైంది 
నిర్మాణ సంస్థ : సురేష్ ప్రొడక్షన్ 
తారాగణం : విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభిన‌వ్ గొమ‌టం, వెంక‌టేశ్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్‌, సిమ్ర‌న్ చౌద‌రి తదితరులు. 
సంగీతం: వివేక్ సాగ‌ర్‌
నిర్మాత‌: డి.సురేశ్ బాబు
ద‌ర్శ‌క‌త్వం: త‌రుణ్ భాస్క‌ర్ దాస్యం
చిత్రం విడుదల : శుక్రవారం 
 
తరుణ్ భాస్కర్. టాలీవుడ్‌కు పరిచయమైన యువ డైరెక్టర్. 'పెళ్లిచూపులు' చిత్రంతో అటు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను, ఇటు అవార్డుల‌ుతో పాటు రివార్డులు అందుకున్న దర్శకుడు. త‌న చుట్టూ జ‌రిగే క‌థ‌తో ఆయ‌న తెర‌కెక్కించిన 'పెళ్లిచూపులు' ప్రేక్ష‌కుల మ‌నసుల్లో ఇంకా ప‌దిలంగా ఉంది. తొలి సినిమా స‌క్సెస్ కాగానే రెండో సినిమాను స్టార్ హీరోలతో తెర‌కెక్కించాల‌నుకోవ‌డం నేటి ట్రెండ్. అయితే ట్రెండ్‌కి భిన్నంగా రెండో చిత్రాన్ని కూడా కొత్త న‌టీన‌టుల‌తో తెర‌కెక్కించారు. ఆ చిత్రమే ఈ నగరానికి ఏమైంది. తరుణ్ భాస్కర్ చెప్పిన కథను నమ్మి తెరకెక్కించిన నిర్మాత సురేష్ బాబు నమ్మకాన్ని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నిలబెట్టాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే చిత్ర కథను సమీక్షించాల్సిందే.
 
క‌థ‌:
విశ్వక్ సేన్ నాయుడు (వివేక్‌), సుశాంత్ రెడ్డి (కార్తిక్‌), అభిన‌వ్ గొమ‌టం (కౌశిక్‌), వెంక‌టేశ్ కాకుమాను (ఉప్పు) అనే నలుగురు యువకులు మంచి స్నేహితులు. బాల్యం నుంచే కలిసిమెలిసి తిరుగుతుంటారు. వీరికి లక్ష్యం ఉంది. అదే షార్ట్ ఫిల్మ్ తీయాల‌న్న‌దే. ఆ ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గానే వివేక్ ప్రేమ‌లో ప‌డతాడు. అత‌నికున్న భ‌యాన్ని చూసి అత‌ని ప్రియురాలు తెగదెంపులు చేసుకుంటుంది. దాంతో వివేక్ తాగుడుకు బానిసై క‌ర్త‌వ్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తుంటాడు. 
 
అదేసమయంలో వీరంద‌రికీ దూరంగా వెళ్లి కార్తిక్ ఓ పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకునే ప‌నిలో ఉంటాడు. కౌశిక్ డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా, ఉప్పు ఎడిట‌ర్‌గా ఉద్యోగాలు చేస్తుంటారు. త‌న‌కు పెళ్లి కుదిరిన సంద‌ర్భంగా ఫ్రెండ్స్‌కి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలోనే రింగు పోగొట్టుకుంటాడు. తాగిన మ‌త్తులో ఉన్న ఫ్రెండ్స్ అక్క‌డి నుంచి గోవాకు చేరుకుంటాడు. ఖ‌రీదైన రింగు కొన‌డం కోసం వారు చేసిన ప్ర‌య‌త్నాలు ఏంటి? మ‌ర‌లా షార్ట్ ఫిల్మ్ చేయ‌డానికి వారికి స‌హ‌క‌రించింది ఎవ‌రు? చివ‌రికి తీశారా? లేదా? అన్నది వెండితెరపై చూడాల్సిందే. 
 
విశ్లేష‌ణ‌ 
సినిమా అంతా నలుగురు కుర్రాళ్ల చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటీనటులను ఎంచుకున్న దర్శకుడు వాళ్ల నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. పెళ్లిచూపులులాంటి క్లాస్‌ సినిమా తరువాత పక్కా యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఈ సినిమా కూడా అంతే విభిన్నంగా తెరకెక్కించాడని చెప్పొచ్చు. తంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది.
 
ఎందుకంటే రొటీన్‌గా ఓ ల‌వ్ స్టోరీ, నాలుగు పాట‌లు, నాలుగు ఫైట్లు, ప్రీ క్లైమాక్స్, అదిరిపోయే ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, కొన్ని న‌వ్వులు... ఇలాంటి ఫార్ములాకు దూరంగా సాగే సినిమా ఇది. అనుకున్న క‌ల‌ల‌ను సాకారం చేసుకునే ప‌నిలోపడిన న‌లుగురు కుర్రాళ్లు, వాళ్ల‌ల్లో ఒక‌రికి రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే కుటుంబ సమస్యలు, ఒక‌రికి ప్రేమ సమస్య, ఇంకో ఇద్ద‌రు మామూలుగా ఉంటారు. ఏదో చేద్దామ‌ని, డ‌బ్బు కోసం.. డాబు కోసం ఇంకేదో చేయాల‌నుకున్న ఒక ఫ్రెండ్ మ‌న‌సులో ఉన్న విష‌యాన్ని గ్ర‌హించిన మ‌రో ఫ్రెండ్‌.. అత‌ని క‌ల సాకారమయ్యే ద‌శ‌గా అడుగులు వేయించిన తీరు, యువ‌త స‌ర‌దాగా మందు కొట్టిన‌ప్పుడు వారు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో చూపించిన స‌న్నివేశాలు బాగున్నాయి.
 
ముఖ్యంగా, క‌ష్టాల‌న్నింటినీ ప‌క్క‌న‌పెట్టి క‌డుపుబ్బ న‌వ్వించే కామెడీ స‌న్నివేశాలు, న‌లుగురు కుర్ర‌కారు కూర్చుని మాట్లాడుకుంటే చాటుగా మ‌నం విన్న‌ప్పుడు ఎలాంటి డైలాగులు వినిపిస్తాయో అలాంటి డైలాగులు... మేన‌మామ తండ్రిలాంటి వాడే అయినా, మేన‌ల్లుడికి ఒక ర‌కంగా స్నేహితుడిలాంటివాడు అని చూపించే షాట్లు... జీవితం ఎక్క‌డా ఆగిపోదని, కావాల్సిన నాలుగు మెతుకులు, మ‌న అనుకున్న న‌లుగురు స్నేహితులు, న‌చ్చిన ఉద్యోగం, ఎదురుప‌డితే న‌వ్వుతూ ప‌ల‌క‌రించే న‌లుగురు ఆప్తులు అని చెప్ప‌క‌నే చెప్పిన సినిమా 'ఈ నగారానికి ఏమైంది'. 
 
క‌థ‌గా ఈ సినిమాలో చెప్పుకోవ‌డానికి పెద్ద‌గా ఏమీ లేక‌పోయినా, ఇది... కొత్త‌ది అని చెప్పేంత‌గా లేక‌పోయినా, స‌న్నివేశాల‌ను, కామెడీని చ‌క్క‌గా ఉన్నాయి. తొలి చిత్రంలోలాగా ఈ సినిమాలోనూ సింక్ సౌండ్ చేశారు. టెక్నిక‌ల్‌గా అత‌ని గ‌త సినిమాక‌న్నా ఈ సినిమా బావుంది. వివేక్ సాగ‌ర్ సౌండ్ బావుంది. క్లైమాక్స్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌న్నివేశాన్ని లింక్ చేసిన తీరు బావుంది. ఫ్రెండ్స్ గ్యాంగ్‌లుగా వెళ్లి స‌ర‌దాగా చూసే చిత్ర‌మ‌వుతుంది.
 
ఈ చిత్రానికి గల బలాలను పరీక్షిస్తే, అంతా కొత్తవారే అయినప్పటికీ వారి నటన, వారు పండించిన హాస్యం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ మ్యూజిక్, టెక్నిక‌ల్ టీమ్ వ‌ర్క్ చాలా బాగున్నాయి. అలాగే, మైనస్ పాయింట్లను విశ్లేషిస్తే, సినిమాలో అక్క‌డ‌క్క‌డ సాగ‌దీత‌ ధోరణి కనిపించడం, ప్రేమ స‌న్నివేశాలు మిస్ కావ‌డం, చిత్రం చూస్తున్నంత సేపు స‌హజ‌త్వానికి దూరంగా ఉన్న‌ట్టు అనిపించడం. మొత్తం మీద ఈ చిత్రం సరదా కోసం చూడొచ్చు. వీడియో రివ్యూ... 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు