భారత్ పైలట్ అనుకుని పాకిస్థాన్ పైలట్‌ను కొట్టి చంపిన అల్లరి మూకలు...

ఆదివారం, 3 మార్చి 2019 (18:06 IST)
భారత పైలట్ అనుకుని పాకిస్థాన్ పైలట్‌ను కొందరు స్థానికులు కొట్టారు. వారు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఆ పైలట్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పాక్ గడ్డపై అడుగు పెట్టిన భారత పైలట్‌ను అల్లరి మూకల దాడి నుంచి సురక్షితంగా రక్షించిన పాకిస్థాన్ ఆర్మీ తమ పైలట్‌ను మాత్రం కాపాడుకోలేక పోయింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, భారత్ రక్షణ స్థావరాలపై దాడి చేసేందుకు వచ్చిన పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలను భారత వైమానికి దళానికి చెందిన మిగ్-21 విమానాలు తరిమికొట్టాయి. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తాను నడుపుతున్న విమానం ద్వారా పాక్ యుద్ధ విమానాన్ని కూల్చివేశాడు. ఆ యుద్ధ విమానాన్ని నడుపుతున్న పాక్ పైలట్ షాజుద్దీన్ పారాచ్యూట్ సాయంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని నౌషేరా సమీపంలోని లీమ్‌ లోయల్ దిగాడు. షాజుద్దీన్‌ గాల్లోంచి దిగీదిగగానే కొందరు అతడిని చుట్టుముట్టారు. 
 
పాకిస్థాన్‌ వాయుసేన యూనిఫాం ధరించి ఉన్నా అతడిని భారత పైలట్‌గానే భ్రమించారు. అంతే అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెత్తురోడేలా చితగ్గొట్టారు. అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. షాజుద్దీన్‌ అక్కడ చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయాడు. 
 
భారత పైలట్ అభినందన్‌ను మూకదాడి నుంచి రక్షించిన పాక్‌ ఆర్మీ అధికారులు... తమ పైలట్‌ షాజుద్దీన్‌ను కాపాడుకోలేకపోవడమే వైచిత్రి. అభినందన్‌ తండ్రిలాగే షాజుద్దీన్‌ తండ్రి వసీముద్దీన్‌ కూడా పాకిస్థాన్ వాయుసేనలో ఎయిర్‌ మార్షల్‌గా పనిచేయడం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు