పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్యారాచూట్ సాయంతో అభినందన్ పాక్ భూభాగంపై ల్యాండ్ అయిన వేళ, ఆయన వద్ద ఓ పిస్టల్‌తో పాటు భారత మ్యాప్‌లు, అతను దిగాల్సిన ఎయిర్ బేస్‌లు, పరిస్థితి అదుపుతప్పితే ల్యాండ్ కావాల్సిన అత్యవసర రన్ వేలు తదితరాల మ్యాప్‌లతో కూడిన పత్రాలున్నాయి. అలాగే ఫస్ట్ ఎయిడ్ కోసం కొన్ని రకాల మందులు, ఆయన చేతికి ఉంగరం, వాచీ, కళ్లజోడు తదితరాలు కూడా ఉన్నాయి.
అయితే, పాకిస్థాన్ సైన్యానికి పట్టుబడే ముందు అభినందన్ తన వద్ద ఉన్న రహస్య పత్రాలను నాశనం చేశాడు. కొన్నింటిని నమిలి మింగేశాడు. తనపై రాళ్లు రువ్విన స్థానికుల గుంపును అదుపు చేసేందుకు తన వద్ద తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పాక్ సైనికులు వచ్చి అభినందన్‌ను తమ అదుపులోకి తీసుకున్నాయి. అలాగే, అతని వద్ద ఉన్న అన్ని వస్తువులను పాక్ స్వాధీనం చేసుకుంది.
వేసుకున్న దుస్తుల నుంచి, ఐడీ కార్డు, గన్, ఉంగరం, వాచీ, కళ్లజోడు తదితరాలన్నీ తీసేసుకుంది. అభినందన్‌ను తమ దేశానికి పట్టుబడిన యుద్ధ ఖైదీగా పేర్కొంటూ 27,981 నంబరును ఇచ్చింది. తిరిగి ఇండియాకు అప్పగిస్తున్న వేళ, గన్‌ను ఇవ్వకుండా వాచీ, ఉంగరం తదితరాలను ఇస్తూ, వాటిని ఇచ్చినట్టు ఓ దస్త్రాలపై సంతకం చేయించుకుంది.
ఇక ఇదే విషయాన్ని తనను కలిసిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందన్ వివరించారు. తనకు ప్రత్యేక సివిల్ డ్రస్‌ను ఇచ్చారని, పాక్ అధికారులు తనను శారీరకంగా హింసించలేదని, మానసికంగా మాత్రం ఇబ్బంది పెట్టారని చెప్పారు. పాక్‌లో తాను గడిపిన 60 గంటల్లో ఏం జరిగిందన్న విషయాన్ని ఆయన భారత ఆర్మీ అధికారులకు చెప్పినట్టు సమాచారం.