ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు విమర్శలు గుప్పించారు. పొద్దస్తమానం సింగపూర్ తరహా సిటీ, సింగపూర్ తరహా నిర్మాణాలు నిర్మించాలంటారేగానీ.. సింగపూర్ తరహా పాలన అని మాత్రం అనరంటూ ఎద్దేవా చేశారు.
గురువారం హైదరాబాద్‍లోని జనసేన కార్యాలయంలో వీర మహిళ విభాగం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ఎప్పుడూ సింగపూర్ సిటీలాంటిది నిర్మిస్తా.. సింగపూర్ తరహా నిర్మాణాలు అని అంటారు. అంతే తప్ప, సింగపూర్ తరహా పాలన అని మాత్రం ఆయన చెప్పరు. ఎందుకంటే, అక్కడ చట్టం ఎవరికైనా ఒకే రీతిలో కఠినంగా అమలవుతుంది. మహిళలకి భద్రత ఇస్తుంది. విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై ఓ ఎమ్మెల్యే దాడి చేస్తే కనీసం పట్టించుకోలేదు. వదిలేశారు. అదే సింగపూర్ తరహా పాలన అయితే ఆ ఎమ్మెల్యే జైల్లో ఉంటాడు. మహిళలపై దాడులు చేస్తే చూసీచూడనట్లు వదిలేస్తే అలాంటి ఘటనలు పెరుగుతూ వస్తాయి అని పవన్ అన్నారు.
ఇకపోతే, తనను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శించినా, తిట్టినా పట్టించుకోనని స్పష్టం చేశారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇటీవల నా వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యానించారు. నేను కూడా అంతే స్థాయిలో అనొచ్చు. కానీ, నాకు వారి ఇంట్లోని ఆడపడుచులు, తల్లి, బిడ్డలు గుర్తుకొస్తారు. నేను జగన్‌గారిని వ్యక్తిగతంగా అంటే వారి ఇంట్లోవారు ఎంత బాధపడతారో గ్రహించగలను. ఓ అమ్మాయి నన్ను తిట్టినా నేను అలాగే ఆలోచించాను. మా అమ్మగారు, అక్కాచెల్లెళ్లు, వదిన... వీరందరి మధ్య పెరిగినవాణ్ణి. నాకు చదువు ఇబ్బందిగా మారి, మనసుకు ఎక్కని పరిస్థితుల్లో వదిన గారు ఇచ్చిన ధైర్యం మరిచిపోలేనిదన్నారు.
మహిళలు రాజకీయాలు, ప్రజా జీవితం, సేవా రంగంలోకి వచ్చేటప్పుడు సామాజికంగా వారికి వెన్నుదన్ను ఇవ్వాలి. ఇలా వచ్చేటప్పుడు నవ్వుతారు... నిరుత్సాహపరుస్తారు. అయితే, బలమైన సంకల్పం, లక్ష్య సాధనపై ఆత్మ విశ్వాసం ఉండాలి. మన ఆడపడుచులందరిలో నిగూఢమైన శక్తి ఉంది. మన ఇంట్లోనే అమ్మను చూడండి... వంటిల్లు చక్కబెడుతుంది. పిల్లల బాధ్యత చూస్తోంది, భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. ఆర్థిక విషయాలను చూసుకొంటుంది. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా చూస్తుందని ఆయన గుర్తు చేశారు.