ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు విమర్శలు గుప్పించారు. తన పోరాట యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ, 65 ఏళ్ల వయసు వచ్చినా డబ్బు, పదవిపై చంద్రబాబుకు వ్యామోహం తగ్గలేదని విమర్శించారు. 2019 ఎన్నికలు ఏపీకి చాలా కీలకమని... రాజకీయరంగంలో ఆర్థిక, సామాజిక విప్లవాన్ని జనసేన తీసుకురాబోతోందని చెప్పారు.
రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు, లోకేష్, జగన్‌లు తమ అనుచరులతో కలిసి రావాలని, తాను ఒక్కడినే వస్తానని... ఏ పాలసీపైనైనా చర్చలో కూర్చుందామని... అప్పుడు ఎవరికి ఎంత పరిజ్ఞానం ఉందో తెలుస్తుందని సవాల్ విసిరారు. జనసేనకు భావజాలం పుష్కలంగా ఉందని... వైసీపీకి అది లేదని విమర్శించారు. 2019 ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
పనిలోపనిగా చంద్రబాబు తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌కు కూడా ఆయన ఓ సవాల్ విసిరారు. దమ్ముంటే లోకేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి.. ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. లోకేశ్ మీద జనసేన తరపున ఒక కార్యకర్తను నిలబెడతామని, ఎవరు గెలుస్తారో చూద్దామన్నారు. దొడ్డిదారిన లోకేశ్‌ను మంత్రిని చేశారని, ఆయనను సీఎం చేయాలని చూస్తే ఊరుకోబోమని పవన్ హెచ్చరించారు.