ప్రత్యక్ష ఎన్నికల్లో నారా లోకేశ్ గెలువరని చంద్రబాబుకు తెలుసు : పవన్

ఆదివారం, 8 జులై 2018 (15:00 IST)
ప్రత్యక్ష ఎన్నికల్లో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ గెలవరని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా తెలుసని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆదివారం విశాఖపట్టణంలో జరిగిన ఓ సమావేశంలో పవన్ మాట్లాడుతూ, తన కుమారుడు, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి లోకేశ్ ఎమ్మెల్యేగా గెలవగలరనే నమ్మకం ఏపీ సీఎం చంద్రబాబుకి లేదన్నారు.
 
రాజకీయాలు, ప్రజా సమస్యల గురించి సినీ నటుడైన తనకు ఏం తెలుసని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. నిజానికి తాను ఏ విధానంపై అయినా మాట్లాడడానికి సిద్ధమని ప్రకటించారు. తాను అన్ని విషయాలను చదువుకునే రాజకీయాల్లోకి వచ్చానని, విధానాలపై చర్చించేందుకు చంద్రబాబు, లోకేశ్‌, జగన్‌ రావాలని పిలుపునిచ్చారు.
 
ప్రతి అంశంపై తనకు అవగాహన ఉందన్నారు. అదేసమయంలో తాను కొందరిలా ఐఏఎస్‌లపై ఆధారపడే వాడిని కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన సర్కారుని ఏర్పాటు చేయడమే జనసేన లక్ష్యమని, బలమైన భావజాలంతో జనసేన పార్టీ స్థాపించానన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిపోతున్నా ధనికులు మరింత ధనికులు అవుతున్నారని పేదల పరిస్థితులు మాత్రం మారట్లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు