కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - సంపత్‌ల శాసనసభ సభ్యత్వం రద్దు

మంగళవారం, 13 మార్చి 2018 (10:13 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెడ్‌ఫోన్ విసిరివేయడంతో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైంది. ఈ చర్యను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సభలో అనుచితంగా ప్రవర్తించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‍ల అసెంబ్లీ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే స్పీకర్ మధుసూదనాచారి సోమవారం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. సభలో అవాంఛనీయ ఘటనకు పాల్పడిన 11 మంది కాంగ్రెస్ సభ్యులను ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. 
 
అలాగే మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్‌ఫోన్‌ విసిరి గాయపర్చారంటూ  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌‌ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేశారు. జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతా‌రెడ్డి, చిన్నారెడ్డి, ఉత్తమ్‌కుమార్, డి.కె.అరుణ, మల్లు భట్టి విక్రమార్క, పద్మావతిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వంశీచందర్‌రెడ్డి, మాధవరెడ్డిలను సస్పెండ్ చేయాలంటూ మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన తీర్మానానికి స్పీకర్ మధుసూదనాచారి ఆమోదం తెలిపారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు సమావేశాలు ముగిసేంతవరకు సభకు హాజరుకావడానికి వీల్లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు