తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. అదీ పండుగ వేళ సమ్మకు పూనుకోవడంతో ప్రయాణకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం టీఎస్ ఆర్టీసీ కార్మికులు ఈ సమ్మెకు దిగగా, ఇది శుక్రవారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైంది. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.
కానీ, ప్రభుత్వం మాత్రం పండుగలకు ఊళ్లు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీలో ఇప్పటికే ఉన్న 2100 అద్దె బస్సులతోపాటు, దసరా సెలవులు కావడంతో విద్యాసంస్థల బస్సులను వినియోగించుకోవాలని నిర్ణయించింది. అలాగే, బస్సులు నడిపేందుకు ముందుకొచ్చే ప్రైవేటు క్యారియర్లకు రోజువారీ పర్మిట్లు జారీ చేస్తోంది.
మరోవైపు, బస్సులు రోడ్డుపైకి రాకపోవడంతో ప్రైవేటు క్యారియర్లను నేరుగా ఆర్టీసీ బస్టాండ్లలోకి అనుమతిస్తున్నారు. అయితే, ఈ ఉదయం నుంచి డిపోల వద్ద ధర్నా చేస్తున్న కార్మిక సంఘాల నేతలు ప్రైవేటు బస్సులు రోడ్డుపైకి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
ఇక హైదరాబాద్ మహానగరంలో సిటీ బస్సులు శనివారం ఉదయం నుంచే డిపోలకే పరిమితం కాగా, ఆదివారం జరగనున్న సద్దుల బతుకమ్మ, దసరా పర్వదినాల నిమిత్తం గ్రామాలకు బయలుదేరిన వారంతా వివిధ బస్టాండ్లలో పడిగాపులు పడుతున్నారు.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో, ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయివేట్ సిబ్బందితో బస్సులు నడిపించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.