విశాఖ జిల్లా సింహగిరి మెట్లమార్గంలో బండరాళ్లు దొర్లిపడి మహిళ మృతి చెందడంతో సింహాచలం దేవస్థానం అధికారులు నష్టనివారణ చర్యలు తీసుకుంటున్నారు. సింహగిరి మెట్లమార్గంలో మరమ్మతు పనులు జరుగుతుండటంతో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఆకాశధార దగ్గర నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకూ ప్రమాదకరంగా ఉన్న రాళ్లను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. మెట్లను ఆనుకుని ఉన్న రాళ్లను ముందుగా తొలగించనున్నారు. భవిష్యత్తులో పనుల జరిగేటప్పుడు రాళ్లు జారిపడకుండా ఇనుప మెస్ ఏర్పాటుచేయాలని డిసైడయ్యారు.
ప్రస్తుతానికి భక్తులు మెట్లమార్గంలోకి రాకుండా సింహగిరిపైన, కొండ దిగువన తొలిపావంచా దగ్గర దారులను మూసివేశారు. సెక్యూరిటీ గార్డులను అక్కడ నియమించారు.
మెట్లమార్గంలో ప్రమాదవశాత్తు చనిపోయిన ఆదిరెడ్డి భవానీ కుటుంబానికి దేవస్థానం తరపున రూ.5 లక్షలు, పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నుంచి రూ.3 లక్షలు, ఇంజినీరింగ్ అధికారులు రూ.లక్ష మొత్తం 9 లక్షలు తక్షణ సాయంగా అందిస్తామని అధికారులు చెప్పారు.