వచ్చే 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థికమంత్రిగా ఆయనకిది ఐదోదీపైగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చివరిదీనూ. అదేసమయంలో అనేక సంక్లిష్ట పరిస్థితుల మధ్య ఆయన ఈ దఫా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. దీంతో ఈ బడ్జెట్‌పై అటు దేశప్రజానీకంలోనూ, ఇటు కార్పొరేట్ ప్రపంచంలోనేకాక అంతర్జాతీయంగా కూడా అమితాసక్తి నెలకొంది. అన్నిటికంటే ముఖ్యంగా, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో దీనికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది.
ఆర్థికమంత్రి జైట్లీ బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు లోక్‌సభకు సమర్పిస్తారు. తొలిసారిగా బడ్జెట్ సమర్పణను నెలరోజుల ముందుకు జరిపారు. యేటా ఫిబ్రవరి నెల ఆఖరి పనిదినం నాడు ప్రవేశపెట్టే ఆనవాయితీకి ఆయన స్వస్తి చెప్పారు. అయితే ఆదాయ వ్యయాల లెక్కింపులు, కొత్త ఆర్థిక సంవత్సరపు అవసరాలకు మార్గం సుగమం చెయ్యడం.. మొదలైనవాటికి సమయంచాలక పోవడంతో బడ్జెట్ తేదీని ముందుకు జరిపారు. బడ్జెట్ ప్రతిపాదనలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇబ్బంది లేకుండా ప్రారంభించేందుకు దీన్ని మార్చినట్లు జైట్లీ చెప్పారు. శతాబ్దకాలంగా అమలైన రైల్వేలకు విడి బడ్జెట్‌కు కూడా స్వస్తిపలికి, రైల్వే పద్దులను కూడా వార్షిక బడ్జెట్‌లో కలిపేశారు.
ఇకపోతే, ఈ బడ్జెట్‌పై అనేక సంస్థలు, కార్పొరేట్ వర్గాలు, వ్యవసాయ, మధ్యతరగతి వర్గాలు అనేక ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా, నానాటికీ తగ్గిపోతున్న వ్యవసాయానికి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. వ్యవసాయ రంగ దుస్థితికి ఆయన నిర్దిష్ట చర్యల్ని ప్రతిపాదిస్తారని ఆశిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగుల సంఖ్య 2 కోట్లు. బడ్జెట్‌లో జాతీయ ఉపాధికల్పన విధానం ప్రకటించి ఓ రోడ్‌మ్యా్‌ప్‌ను జైట్లీ ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు.
వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.50 వేలైనా పెంచుతారని, స్టాండర్డ్ డిడక్షన్‌ను మళ్ళీ ప్రవేశపెడతారని భావిస్తున్నారు. అలాగే, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముందు అనేక సవాళ్లు కనిపిస్తున్నాయి. గత నాలుగేళ్ళలో ఎన్నడూ లేనంత తక్కువగా నమోదవుతున్న ఆర్థికవృద్ధికి ఊతమిచ్చే చర్యలుతీసుకోవడం. ఈ మార్చి చివరినాటికి 6.75 శాతం, వచ్చే ఆర్థిక సంత్సరంలో 7-7.5 శాతం పెంచేందుకు ఆయన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.