నిర్మలమ్మ పద్దుల లెక్క ... వరాలు కురిపిస్తారా.. వాతలు పెడతారా?

శనివారం, 1 ఫిబ్రవరి 2020 (09:19 IST)
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికిగాను ఆర్థిక బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. అంటే ఎనిమిది నెలల క్రితం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఎనిమిది నెలల తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. దీంతో ఈ బడ్జెట్‌లో వరాలు కురిపిస్తారా? లేక వాతలు పెడుతారా? అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. 
 
ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. కానీ, ఈసారి ‘ఫీల్‌ గుడ్‌’ బడ్జెట్టే ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ఒక కారణం.. ఆర్థిక మాంద్యం కాగా.. మరొక కారణం ఢిల్లీ ఎన్నికలని విశ్లేషిస్తున్నారు. ఆర్థిక మందగమనం తారస్థాయికి చేరిన నేపథ్యంలో కన్య్జూమర్‌ డిమాండ్‌, ఇన్వె్‌స్టమెంట్‌ పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్ని చర్యలూ తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. 
 
ముఖ్యంగా, వేతన జీవులకు లబ్ది చేకూర్చేలా ఆదాయపన్ను పరిమితి పెంపు, సెక్షన్‌ 80సి కింద పన్ను రాయితీలను కల్పించడం, స్టాండర్డ్‌ డిడక్షన్‌ను పెంచడం వంటి అనేక చర్యలను ప్రకటించవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేతన వర్గాలు పొదుపు చేసేందుకు వీలుగా జాతీయ పింఛన్‌ పథకం, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ డిపాజిట్ల పెంపు, పన్ను లేని సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్‌ పథకం తదితరాలను ప్రకటించవచ్చునని అంచనా వేస్తున్నారు. 
 
మధ్య తరగతి చెల్లించే పన్ను శ్లాబ్‌లను పెంచి, పన్ను లేని నగదు చేతిలో ఆడేలా చేయడం ద్వారా వినియోగాన్ని పెంచాలని, తద్వారా, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే పథకాలను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు వీలుగా గ్రామీణ రంగానికి భారీ కేటాయింపులు ఉంటాయని, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, ఎగుమతులను ప్రోత్సహించేందుకు అనేక రాయితీలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు