కార్పొరేట్ పన్నుల్లో తేడాలొద్దు : కేంద్రానికి విజ్ఞప్తి చేసిన పారిశ్రామిక దిగ్గజాలు

మంగళవారం, 28 జనవరి 2020 (13:45 IST)
ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర వార్షిక బడ్జెట్ 2020-21ను విత్తమంత్రి నిర్మలా సీతారమన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. దీంతో వేతన జీవుల నుంచి దిగ్గజ పారిశ్రామికదిగ్గజాల వరకు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా, కార్పొరేట్ రంగం మరిన్ని రాయితీలు కల్పించాలని కోరుతోంది. ఇదే విషయంపై కేంద్ర ఆర్థిక శాఖామంత్రితో సమావేశంకూడా అయ్యారు. ఈ సందర్భంగా వారు ఒక విజ్ఞప్తి చేశారు.
 
కార్పొరేట్‌ పన్ను రేట్లలో తేడాలు వద్దని, అన్నింటినీ 15 శాతంగా నిర్ణయించాలని కోరారు. ఈ మేరకు వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ.. కేంద్రాన్ని కోరింది. రాబోయే బడ్జెట్‌లో ఈ మేరకు ఓ ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేసింది. 
 
ఏప్రిల్‌ 1, 2023 నాటికి ఎటువంటి మినహాయింపులు, ప్రోత్సాహకాలు లేకుండా అమలు చేయాలని సూచించింది. దీనివల్ల మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచినట్లవుతుందని, పెట్టుబడులకూ ఊతమిచ్చినట్లువుతుందని సీఐఐ అధ్యక్షుడు విక్రమ్‌ కిర్లోస్కర్‌ అన్నారు. 
 
కాగా, 2023కల్లా ఒకే కార్పొరేట్‌ పన్నును అమల్లోకి తెస్తామన్న ప్రకటన ఈ బడ్జెట్‌లోనే వస్తే మదుపరులు పెద్ద ఎత్తున పెట్టుబడులతో ముందుకు వచ్చే వీలుంటుందని చెప్పారు. గతేడాది కార్పొరేట్‌ పన్ను రేట్లను కేంద్రం 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. 
 
అయితే ఎలాంటి పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలను సంస్థలు పొందకుండా చేసింది. అయినప్పటికీ నిరుడు అక్టోబర్‌ 1 నుంచి మార్చి 31, 2023లోగా ఏర్పాటై ఉత్పత్తిని ప్రారంభించే సంస్థలకు కార్పొరేట్‌ పన్ను 15 శాతమేనని మోడీ సర్కారు స్పష్టం చేసింది. దీనికి సర్‌చార్జీ, సెస్సు అదనం. 1991-92లో 45 శాతంగా ఉన్న కార్పొరేట్‌ పన్ను.. 2019-20లో 22 శాతానికి దిగొచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు