ఆదాయపన్నులో మెలిక... వేతన జీవులకు వాత పెట్టిన నిర్మలమ్మ

ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (13:29 IST)
లోక్‌సభలో శనివారం ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌లో విత్తమంత్రి నిర్మలా సీతారమన్ కొత్త ఆదాయన్ను విధానాన్ని ప్రతిపాదించారు. ఈ విధానాన్ని ఎంచుకుంటే పన్ను రేట్లు తగ్గుతాయని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, పాత విధానంలో ఇచ్చిన పలు మినహాయింపులు, తగ్గింపులు పూర్తిగా తుడిసిపెట్టుకునిపోతాయి. అంటే వేతన జీవులకు ఇచ్చినట్టే ఇచ్చి వాతలు పెట్టారన్నమాట. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే కోల్పోయేవి ఏంటో ఓసారి తెలుసుకుందాం. 
 
కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే పాత పన్ను విధానంలో 80సీ, 80సీసీసీ, 80సీసీడీ సెక్షన్ల కింద గరిష్టంగా లభించే రూ.1.5 లక్షల మినహాయింపు పోతుంది. ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్‌), ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌), బ్యాంకులో వేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఆరోగ్య బీమా, ఎల్‌ఐసీ ప్రీమియమ్‌లు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు వంటివి ఈ సెక్షన్ల కిందికి వస్తాయి.
 
80 డి కింద ఆరోగ్య బీమా (మామూలు వ్యక్తులకు రూ.25 వేలు, వృద్ధులకైతే రూ.30 వేలు) పై మినహాయింపు పోతుంది. సెక్షన్‌ 80టీటీఏ కింద.. పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ (రూ.10 వేల లోపు) మినహాయింపు పోతుంది. ఈక్విటీ సేవింగ్‌ పథకాల్లో పెట్టే సొమ్ములో 50 శాతం (గరిష్ఠంగా రూ.25 వేలు)పై 80 సీసీజీ కింద వర్తించే పన్ను మినహాయింపు లభించదు.
 
అలాగే, ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై సెక్షన్‌ 80ఈఈబీ కింద.. ఉన్నత విద్యకు తీసుకునే రుణాలపై వడ్డీకి సంబంధించి సెక్షన్‌ 80ఈ కింద (దీనికైతే పరిమితి లేదు).. దాతృత్వ సంస్థలకు ఇచ్చే విరాళాలపై 80జీ కింద.. వైద్య ఖర్చులపై సెక్షన్‌ 80 డీడీబీ కింద.. ఉద్యోగులకు ఎల్టీసీ, హౌస్‌ రెంటు అలవెన్స్‌ (అద్దె భత్యం)కింద ఇస్తున్న చాలా మినహాయింపులు పోతాయి. అందువల్ల వేతన జీవులు ఆలోచించి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు