కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వివిధ రంగాల్లో పలు రకాల క్యాటగిరీల్లో పని చేస్తున్న కార్మికులకు సమాన వేతనం విధానం అమలు చేయాలని ప్రతిపాదించారు. అన్ని క్యాటగిరీల్లో మహిళలు పని చేసేందుకు సరైన రక్షణ వాతావరణం కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. డీప్ ఓషన్ మిషన్ వచ్చే నాలుగేండ్లలో చేపట్టనున్నట్లు, దీనికి రూ.4000 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఇక సులభతర వానిజ్యం కోసం మల్టీ స్టేట్ కోఆపరేటివ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.
అలాగే, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన లడఖ్ రాజధాని లేహ్‌లో కేంద్రీయ యూనివర్సిటీని నెలకొల్పనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2019లో జమ్ముకశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడంతోపాటు దానికి గల రాష్ట్ర హోదాను మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. జమ్ముకశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లేహ్ ప్రాంత అభివ్రుద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉన్నట్లు సంకేతాలిచ్చింది.
ఇకపోతే, ఆర్థిక రంగ సేవల్లో కీలకమైన బీమా రంగ ప్రయివేటీకరణ దిశగా మరో అడుగు ముందుకేశారు. బీమా సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పరిమితిని మరింత పెంచేందుకు బీమా చట్టం సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు బీమా రంగంలో నేరుగా 49 శాతం వరకు మాత్రమే ఎఫ్‌డీఐలను అనుమతించే వారు. ఆర్థిక రంగ పునరుత్తేజం కోసం ఈ పరిమితిని 74 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.