ప్రేమంటే.. ఇంతేనా..!!?

WD
ప్రేమ... విశ్వవ్యాప్తమైన ఓ అద్భుత భావం. కులం, మతం, భాష, ప్రాంతం, భావం, అలవాట్లు, ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయం, హోదాలకు అతీతంగా రెండు హృదయాలను పెనవేయగల ఓ మహత్తర బంధం. స్వచ్ఛమైన భావంతో దగ్గరైన రెండు హృదయాలకు మాత్రమే అర్థంకాగల ఓ అనిర్వచనీయమైన అనుభూతి.

అందుకే యుగాలు మారినా, తరాలు మారినా, ద్వేషించేవారు ఎక్కువైనా, అర్థం చేసుకునేవారు అసలే లేకున్నా నిరంతరం పారే జీవనదిలా ప్రేమ తన పయనం సాగిస్తూనే ఉంది. ప్రేమలోని గొప్పతనాన్ని, ప్రేమించడంలోని తియ్యదనాన్ని తెల్సుకుని ప్రేమించినవారితో పదికాలాలపాటు కలిసి జీవించడమే జీవిత పరమార్ధమని తెలుసుకున్నవారి తోడుగా శిశిరమెరగని వసంతంలా ప్రేమ వికసిస్తూనే ఉంది.

ప్రేయసి కోసం రాజ్యాలను కాదన్నా, వలచినవాడికోసం అయినవారినందరినీ కాదనుకున్నా అది తమ ప్రేమను గెలిపించుకోవడానికే తప్ప మరే స్వార్థమూ లేదని మౌనంగా రోధించే ప్రేమికుల హృదయాల్లో ప్రేమ నిరంతరం చిరంజీవై వర్థిల్లుతూనే ఉంది. కానీ ఎందుకో తెలియదుగానీ ప్రేమ ఎంతో గొప్పదని తెలిసినా దాని పేరు వింటేనే చాలామందికి ఒళ్లంతా జలదరిస్తుంది. దాన్ని నిలువునా చంపేయాలని ఈ భూమ్మీదే లేకుండా చేసేయాలన్నంతగా ఆవేశం పుట్టుకొస్తుంది.

అలా కొందరిలో పుట్టుకొచ్చే ఆవేశం పుణ్యమా అని ప్రేమంటే ఓ వ్యాధిగా, ప్రేమించినవారు రోగులుగా, వారివల్ల ప్రపంచమే సర్వనాశనమై పోతున్నట్టుగా...

అందుకే ప్రేమను ద్వేషించక తప్పదన్నట్టుగా... మరికొందరిలో సైతం ఆవేశం ఎగసిపడుతుంటుంది. వెరసి నేటి సమాజంలో ప్రేమంటే ఓ తప్పుగా, ప్రేమించడం ఓ నేరంగా తయారైంది. అందుకే తల్లి ప్రేమను పొందినవారైనా, సోదర ప్రేమను చూచినవారైనా సరే ఇద్దరు యువతీ యువకుల మధ్య చిగురించే ప్రేమంటే మాత్రం కాస్త చులకనగానే చూసే దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించింది.

ప్రపంచంలోని అన్ని ప్రేమలను గౌరవించి, ఆరాధిస్తున్నప్పుడు ప్రాయం చిగురించే వయసులో మనసుదోచినవారిపై కలిగే ప్రేమపై మాత్రం ఎందుకీ వివక్ష...? ప్రపంచంలోని అన్ని రకాల ప్రేమలూ గొప్పవైనప్పుడు నవ యవ్వనంలో చిగురించే ప్రేమ మాత్రం మనిషిని పాడు చేసేస్తోందని, సాంప్రదాయాన్ని కాలరాసేస్తోందని దానిపై అంతలా కక్ష కట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది... అంటూ ప్రశ్నిస్తే ప్రేమించి పాడైపోయిన ఒకరిద్దరివైపు చేయి చాపి చూపిస్తుందీ లోకం. ప్రేమ వల్లే వారలా పాడయ్యారు అందుకే ఆ పాపిష్టి ప్రేమ మీకొద్దూ అంటూ ఉపన్యాసం దంచేస్తుంది.

WD
ప్రేమంటే అంతేనా...? నిజమైన ప్రేమంటే తెలియకుండా, కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా వయసు మోహంలో, శరీర ఆకర్షణే ప్రధానంగా తప్పుచేసిన ఆ ఒకరిద్దరేనా ప్రేమికులంటే...? అలా ఆ కొందరివల్లే ప్రేమను తప్పుపట్టాల్సివస్తే మరి లోకంలోని మిగితా బంధాల్లో తప్పులు జరగడమే లేదా...? అంత మాత్రాన ఆ బంధాలను చులకన చేసేస్తున్నామా...? అని ప్రశ్నిస్తే మాత్రం సదరు వ్యక్తులనుంచి సమాధానం కరువవుతుంది.

పైపెచ్చు వయసు పొంగులో చేస్తున్న అర్థం లేని, పిచ్చి ప్రేలాపనగా కొట్టిపారేస్తుందీ లోకం. కానీ ఎవరో ఏదో చెప్పినట్టు, సినిమాల్లో చూపించినట్టు, ఒళ్లు కొవ్వెక్కిన రెండు శరీరాలు సముద్ర తీరాల్లో, పార్కుల్లో, మసక చీకట్లో హద్దులు మరిచి చేసే శృంగార కేళి కాదు ప్రేమంటే... మనసులోంచి పుట్టి, మమతై పెరిగి జీవిత పర్యంతం ఒకరికి ఒకరుగా సాగాలనే దృఢ చిత్తంతో నిండినదే ప్రేమంటే...

అటువంటి ప్రేమలో అభిమానం తప్ప ఆకర్షణ ఉండదు. ఆప్యాయతలు తప్ప అరమరికలు ఉండవు. నమ్మకం తప్ప మోసం ఉండదు. మొత్తంగా నీకు నేను... నాకు నువ్వు... అన్న భావం తప్ప అనుభవించి పారిపోయే దుర్మార్గం ఉండదు. అంతేకాదు నిజమైన ప్రేమ మనసులో చిగురించినపుడు ఆ ప్రేమ సఫలం కాకున్నా ఎదుటివారిపై కోపం రాదు. ద్వేషం అసలే రాదు.

ఎందుకంటే ప్రేమ వేరు. తనకు మాత్రమే దక్కాలన్న కోరిక వేరు. అందుకే ప్రేమ ఉన్న చోట కోరిక ఉండదు. కోరిక ఉన్నచోట ప్రేమ ఉండదు. మొత్తంగా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నచోట దాని గొప్పతనం గురించి చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితీ ఉండదు.

రానున్నది ప్రేమికుల రోజు దినోత్సవం... ఆ దినోత్సవాన్ని జరుపుకోవాలని తపించే యువ హృదయాలు ఒకవైపు... ఆ దినోత్సవం జరుపుకోవడం మన సంస్కృతి కాదు కాబట్టి జరుపుకుంటే అంతుచూస్తాం అంటూ బెదిరించేవారు ఇంకోవైపు... ప్రేమ అనే అనంతమైన భావాన్ని రంగుల కాగితాల్లో నింపేసి అదే ప్రేమంటూ చెప్పే బహుళజాతి సంస్థల నడుమ... ప్రేమంటే పార్కుల్లో తిరగడం, ఒళ్లూ-ఒళ్లూ రాసుకునేలా ప్రవర్తించడం, చివరకు అమ్మానాన్నలకు ఇష్టం లేదనో... కెరీర్‌కు అడ్డొస్తొందనో ప్రేమనే త్యాగం చేసే నవీన మేధావుల మధ్య... నిర్వచించలేని ప్రేమ భావానికి చెత్త చెత్త నిర్వచనాలిచ్చి పరిణితైనా చెందని యువతను పెడదోవ పట్టించే సినిమాల లోకంలోకి...

స్వచ్ఛమైన ప్రేమ ఒక్కసారి సూటిగా చూస్తే... అప్పుడు అసలు ప్రేమ విప్పారుతుంది. అదే నిజమైన ప్రేమికులకు నిత్య వసంతం పూయిస్తుంది. మరి కోరుకుందాం... ఆ నవవసంతపు ప్రేమరాజ్యాన్ని.... ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.