చేదు చేదు కాకరతో.. టేస్టీ స్టఫింగ్ ఎలా చేయాలి..?

శనివారం, 14 మే 2016 (17:08 IST)
కాకరకాయలు రుచికి చేదుగా ఉంటాయి కాబట్టి తినడానికి అంతగా ఇష్టపడరు. చిన్నపిల్లలైతే అసలే తినరు. కాకరలో చాలా రకాలున్నాయి. వీటిలో పొడుగు, పొట్టి రకాలే కాకుండా లేత ఆకుపచ్చ, తెలుపు కలగలసిన రంగులలో కూడా ఉంటాయి. కాకరకాయ వైద్యపరంగా ఔషధంగా ఉపయోగ పడుతుంది. దీన్ని ఆయుర్వేద వైద్యంలో అధికంగా ఉపయోగిస్తారు. కాకరను వారానికి ఓ సారి ఆహారంలో తీసుకుంటే మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. అలాంటి కాకరతో స్టఫింగ్ ఎలా తయారుచేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్ధాలు
కాకరకాయలు - 5
ఆలుగడ్డలు - 3 (ఉడికించినవి) 
ఉల్లిపాయతరుగు - 1/2 తరిగినవి
ధనియాల పౌడర్ - 1 స్పూన్ 
నూనె - వేయించడానికి సరిపడా
జీలకర్ర పౌడర్ - 1 స్పూన్ 
పోపు దినుసులు - తగినంత
కారం - సరిపడా
ఉప్పు - రుచికి తగినంత
పసుపు -చిటికెడు
పచ్చిశెనగలు - 2 స్పూన్  
నూనె - సరిపడా
 
తయారీ విధానము:
కాకరకాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాడలని కట్ చేసి లోపల వున్న విత్తనాలను తీసెయ్యాలి. ఒక మందపాటి గిన్నెలో కాకరకాయ ముక్కలను వేసి, రెండు గ్లాసుల నీళ్ళు పోసి, చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసి, ఉడికించుకోవాలి. కాకరకాయలు ఉడికిన తరవాత, నీళ్ళును వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద పాత్ర పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తరవాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశెనగ పప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తరవాత ఆలుగడ్డను వేసి వేయించాలి. 
 
అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీలకర్రపౌడర్ వేసి బాగా కలిపి వేయించి దించుకోవాలి. ఈ మిశ్రమం చల్లబడిన తరవాత కాకరకాయ ముక్కలలో పూర్ణంలా పెట్టుకోవాలి. ఇంకో పాత్రను గ్యాస్ మీద పెట్టి కొంచెం నూనె వేసి కాకరకాయ ముక్కలను ఒకోక్కటిగా వేసి చిన్న మంట మీద వేపుకోవాలి. నాలుగు వైపుల తిప్పుతూ వేపుకోవాలి. అంతే! ఎంతో రుచిగా వుండే కాకరకాయ స్టఫింగ్ రెడీ!

వెబ్దునియా పై చదవండి