ఆలూ కుర్మాతో రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్

సోమవారం, 31 డిశెంబరు 2012 (16:46 IST)
FILE
బ్రేక్ ఫాస్ట్ అంటే ముందు గుర్తుకు వచ్చేవి చపాతీలు, దోసెలు. వీటిని ఇంకా రుచికరంగా చేయాలంటే వాటిని ఆలూ కుర్మాతో నంజుకుంటే యమా టెస్టుగా ఉంటుంది. అయితే ఈ ఆలూ కూర్మా తయారు చేయడం ఎలాగో చూద్దామా..!

కావలసిన పదార్థాలు :
బంగాళదుంపలు- 3 (ఉడికించి పై పొట్టు తీసి ముక్కలుగా కట్ చేయాలి)
ఉల్లిపాయలు- 1 (సన్నగా తరగాలి)
టొమాటోలు- 2 (పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కరివేపాకు- రెమ్మ
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
పసుపు - పావు టీ స్పూన్,
కారం- అరటీ స్పూన్
ధనియాల పొడి- టి స్పూన్
సోంపు- పావు టీ స్పూన్
పచ్చికొబ్బరి- 3 టేబుల్ స్పూన్లు
గసగసాలు- అరటీస్పూన్
జీడిపప్పు- 6
నీళ్ళు కొద్దిగా

తయారీ విధానం :
బాణలిలో నూనె వేడయ్యాక ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వేసి, మరో రెండు నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. టొమాటో, బంగాళదుంప ముక్కలు వేసి, కలిపి మూత పెట్టి మీడియం హీట్‌లో ఐదు నిమిషాలు ఉడికించాక, మంట తగ్గాలి. కొబ్బరి, గసగసాలు, సోంపు, జీడిపప్పు కలిపి చేసిన పేస్ట్ వేసి కలపాలి. ఇందులో అరకప్పు నీళ్ళు పోసి, ఉప్పు సరిపడినంత ఉందో లేదో చూసుకొని ఎనిమిది నిమిషాలు ఉడికించాలి. గ్రేవి సరిపడినంత చిక్కగా అయ్యాక మంట తీసేసి, కొత్తిమీర చల్లుకోవాలి, ఈ కుర్మా రోటీ, కొబ్బరి అన్నం లోకి రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి