మసాలా ఇడ్లీ ఎలా చేయాలి ?

FILE
ఒక్క ఇడ్లీలో 65 కెలోరీలు ఉంటాయి. ఇడ్లీని తినడం ద్వారా ఊబకాయం, అసిడిటీకి చెక్ పెట్టవచ్చు. ఉడికించి తినడంతో త్వరగా జీర్ణం అవుతాయి. ఎప్పుడూ ఇడ్లీలే బోర్ కొట్టాయనుకోండి.. వెంటనే మసాలా ఇడ్లీ చేసేయండి. మసాలా ఇడ్లీ ఎలా చేయాలంటే..

కావలసిన పదార్థాలు:
బాయిల్డ్ బియ్యం - 4 కప్పులు.
క్యారెట్ - ఒకటి.
మినప్పప్పు - 1 కప్పు.
బఠాణీలు - 50 గ్రా.
కాలిఫ్లవర్ - 50 గ్రా.
బంగాళాదుంపలు - 2.
వేయించిన శనగపప్పు - 2 టీ స్పూన్లు.
కొబ్బరి తురుము - 1 టీ స్పూను.
మినప్పప్పు - 1 టీ స్పూను.
ఆవాలు - 1 టీ స్పూను.
కరివేపాకు - 10 రెమ్మలు.
నెయ్యి - 50 గ్రా.
టమోటా - ఒకటి.
ఉల్లిపాయలు - పావు కిలో.
జీడిపప్పు ముక్కలు - 2 టేబుల్‌ స్పూన్లు.
ఎండుమిర్చి - 6.

తయారీ విధానం:

ముందుగా బియ్యం, మినప్పప్పు విడివిడిగా రుబ్బుకోవాలి. తరవాత రెండింటినీ కలిపి ఉప్పు వేసి ఓ రాత్రంతా పులియబెట్టాలి. బంగాళాదుంపలు, కాలీఫ్లవర్, క్యారెట్‌లను చిన్న చిన్న ముక్కలుగా కోసి కాస్తంత పలుకు ఉండేటట్లే ఉడికించాలి. ఉల్లిపాయలు, జీడిపప్పుని చిన్న ముక్కలుగా కోయాలి. కొబ్బరి తురుము, వేయించిన శనగపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కలిపి మెత్తగా నూరాలి.

ఓ బాణలిలో 3 టీ స్పూన్ల నెయ్యి వేసి వేడిచేసి ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసి చిటపటమన్నాక టమోటా, ఉల్లి, జీడిపప్పు, ఇతర కూరగాయముక్కలు వేసి ఓ ఐదు నిమిషాలు వేయించాలి. ఇందులోనే కొబ్బరి పచ్చిమిర్చి ముద్దను కూడా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటినీ ఇడ్లీపిండిలో కలిపి కొద్దికొద్దిగా రేకుల్లో వేసి ఉడికిస్తే మసాలా ఇడ్లీ రెడీ!

వెబ్దునియా పై చదవండి