వినాయక వ్రత కథ మీకు తెలుసా?

FILE
గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు. తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు. ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీ దేవి విలపించింది. జగత్తుకు శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది.

విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లి గజముఖాసురుని మెప్పించినాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో" అన్నాడు. విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు. శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు.

గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది. తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించి, అయినా మాట తపకుండా కుక్షియందున్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది. నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది" అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు.

నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు. శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు. అక్కడ పార్వతి భర్త రాకను గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది.

తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది. దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసినది. ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది.

శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు.

జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించినాడు. గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు. విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి