కాణిపాకం వినాయకుడి గురించి అసలు నిజం తెలిస్తే?(వీడియో)

గురువారం, 24 ఆగస్టు 2017 (22:20 IST)
అందరి ఆరాధ్య దైవమైన బొజ్జగణపయ్య వేడుకలకు ప్రసిద్ధి ఆలయం కాణిపాకం ముస్తాబైంది. వినాయకుడు స్వయంభువుగా వెలసిన కాణిపాకం ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రతి యేటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దానితో పాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా వినాయకచవితి రోజే ప్రారంభమవుతాయి. దీంతో కాణిపాకమంతా భక్తిపరిమళాలు అద్దుకుంది. వినాయకచవితి సంధర్భంగా చిత్తూరు జిల్లాలోని కాణిపాక ఆలయంపై ప్రత్యేక కథనం.
 
వక్రతుండ మహాకాయ.. కోటిసూర్య సమప్రదాయ అంటే ఆర్తులను అక్కున చేర్చుకుని నిండు ధైర్యాన్ని ఇచ్చేవాడు వినాయకుడు. చేస్తున్న కార్యం నిర్విఘ్నంగా జరగడం కోసం ఎల్లవేళలా తోడుంటానని అభయమిస్తాడు. అందుకే ఏ పని ప్రారంభించాలన్నా ఆ గణనాధుని పూజతోనే ప్రారంభిస్తారు. దీనివల్లే స్వామివారికి ఆదిదేవుడు అని పేరు వచ్చింది. ఎవరైనా బుద్ధి బలంతో పనిచేస్తే విజయం తప్పక సాధిస్తారనడానికి విఘ్నేశ్వరుని జీవితమే ఒక ఉదాహరణ. 
 
తల్లిదండ్రుల ముద్దుల తనయుడిగా, పార్వతీపరమేశ్వరుల ప్రియమైన పుత్రుడిగా పూజలందుకుంటున్న గణనాథుడు భక్తజనాలకు ఎన్నో సందేశాలు ఇస్తున్నారు. ఆయన రూపమే భక్తకోటికి ఒక పెద్ద పాఠం. క్షణికావేశంలో తండ్రి చేసిన తప్పిదానికి కొత్త రూపాన్ని సంతరించుకుని భక్తులకు దర్శనమిస్తున్నారు. అందుకే వినాయకుడు ఒక మంచి కొడుకుగా పేరుతెచ్చుకున్నాడు. తల్లిదండ్రుల మాటను జవదాటని పుత్రునిగా పేరు పొందారు.
 
వినాయకుని నుంచి ఎంతోమంది నేర్చుకోవాల్సిన సందేశాల్లో ఇదీ ఒకటి. అయితే కాణిపాకంలో స్వయంభువుగా వెలిసిన వినాయకునికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. గతంలో ఇక్కడ బాహుదానది ప్రవహించేదని, ఆ నది ఒడ్డున వినాయకుడు బావిలో వెలిశాడని, ప్రతియేటా స్వామివారి విగ్రహం కొంత కొంత పెరుగుతూ వస్తోందని, అందుకే కాణిపాకం ఆలయానికి అంతటి విశిష్టత చేకూరుతుంది. ఒడ్డున పచ్చని పంట పొలాల మధ్య వెలసిన ఈ క్షేత్రంకు వింత గొలిపే పురాణ ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ వెలసిన వినాయకుడు స్వయంభువుడు. బావిలో నుంచి దిన దిన ప్రవర్థమానంగా పెరుగుతున్నాడన్నది భక్తుల నమ్మకం. ఇది నిజమనడానికి ఆధారాలు ఉన్నాయి. 
 
వెయ్యేళ్ళ క్రితం చోళ రాజుల ఏలుబడిలో ఉన్న ఈ కాణిపాకం అప్పుడు విహారపురి అని పిలవబడేది. ఈ గ్రామంలో పుట్టుకతో మూగ, చెవుడు, గ్రుడ్డి వారైన ముగ్గురు సోదరులు ఉండేవారు. వీరికున్న వ్యవసాయమే జీవనాధారం. ఆ ముగ్గరు ఈ స్థలంలోనే ఒక బావిని త్రవ్వుకుని అందులో యాతం ద్వారా నీటిని తోడి భూమి సాగు చేసుకునే వారు. ఒకసారి వర్షాభావం కారణంగా బావిలో నీరు తగ్గడంతో బావిని త్రవ్వడానికి ఉపక్రమించారు. అలా త్రవ్వుతూ ఉండగా బావిలో నుంచి ఠంగ్ మని శబ్దం వినిపించడంతో ముగ్గురు సోదరులు బావిలో ఉన్న రాయిని గమనించి దానిని తొలగించడానికి గడ్డపార, పార ఉపయోగించారు. గడ్డపార రాయి మీద పడగానే రక్తం చిమ్ముకుని పైకి ఎగసిందట. 
 
ఆ రక్తం వికలాంగులైన సోదరులకు తగలడంతో వారి అంగవైకల్యం పోయిందట. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు బావిని మరి కొంత లోతుకు త్రవ్వగా గణనాధుని విగ్రహం బయట పడిందట. దీంతో ప్రజలు భక్తి పారవశ్యంతో టెంకాయలను సమర్పిం చారు. విశేషంగా పగిలిన టెంకాయల నీటి ద్వారా గుడ్డి, మూగ, చెవుడు సోదరుల కాణి భూమి అంతా ప్రవహించింది. దీంతో కాణి భూమి పారిన ఈ స్థలానికి కాణి పారకం అనే పేరు వచ్చింది. 
 
కాలక్రమేణా అది కాణిపాకంగా మారింది. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కుళత్తుంగ చోళుడనే రాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలున్నాయి. అప్పటి నుంచి బావిలోని వినాయకుడు క్రమంగా పెరుగుతున్నాడని భక్తుల విశ్వాసం. ఇందుకు నిదర్శనం కూడా లేకపోలేదు. స్వామివారికి గతంలో చేయించిన వెండి తొడుగులు ఇప్పుడు సరిపోవడంలేదు. ఇప్పటికి మూడుసార్లు వెండి కవచాలు తయారు చేయిస్తే ఇప్పుడు ఏ ఒక్కటి కూడా సరిపడటంలేదు. స్వామివారు రోజురోజుకు పెరిగిపోతుండటంతో వెండి కవచాలను అలంకరించడమే మానేశారు ఆలయ పూజారులు. 
 
ఆలయం సత్యప్రమాణాలకు, మానవ పరివర్తనకు నెలవుగా భాసిల్లుతోంది. పురాణ పురుషుడైన శ్రీ వరసిద్ధి వినాయకుడే ఇక్కడ న్యాయ నిర్ణేత. ఎటువంటి వివాదాలు వచ్చినా, నేరారోపణలు జరిగినా నిర్దోషిత్వం నిరూపణకు కాణిపాకంలో ప్రమాణం చేస్తావా అన్న మాటలే వినిపిస్తాయంటే స్వామి వారి మీద భక్తులకు ఉన్న నమ్మకం అర్థమవుతుంది. స్వామి వారి ముందు తప్పుడు సాక్ష్యమిచ్చిన వారు వెంటనే తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తారన్నది ప్రజల ప్రగాఢ నమ్మకం. 
 
అందుకే ఈ ఆలయంలో సత్య ప్రమాణాలు బ్రిటీష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీగా కొనసాగుతున్నాయి. ఇక్కడి ప్రమాణాలకు ఆంగ్లేయుల కాలంలోని న్యాయస్థానాలలో కూడా అత్యంత విలువ ఉండేది. దురలవాట్లకు బానిసలైన వారిని కూడా స్వామి వారి సన్నిధిలో చేసే ప్రమాణాలు పరివర్తులను చేస్తున్నాయి. దురలవాట్లు మానుకొంటామని ఇక్కడ ప్రమాణం చేసి ఎందరో పరివర్తన చెందారు. 
 
ప్రతియేటా బ్రహ్మోత్సవాలు వినాయకచవితి రోజే ప్రారంభమవుతుంది. ఆ రోజు అంకురార్పణతో ప్రారంభించి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలు వినాయకచవితి మరుసటి రోజున ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది. ఆ తరువాత రాత్రికి హంసవాహనం, రెండో రోజున నెమలి వాహనం, మూడో రోజు మూషిక వాహనం, నాలుగవ రోజు శేష వాహనం, అయిదో రోజు వృషభ వాహనం, ఆరో రోజు గజవాహనం, ఏడో రోజు రథోత్సవం, ఎనిమిదో రోజు అశ్వవాహనం, తొమ్మిదో రోజు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 
 
ఆ మరుసటి రోజు నుంచి మళ్లీ 11 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో మొదటి రోజు అధికార నందీ వాహనం, రెండో రోజు రావణ బ్రహ్మవాహనం, మూడో రోజు యాళీ వాహనం, నాలుగవ రోజు సూర్య ప్రభ వాహనం, అయిదవ రోజు చంద్ర ప్రభ, ఆరో రోజు పూలంగి సేవ, ఏడో రోజు పుష్పపల్లకి సేవ, ఎనిమిదో రోజు విమానోత్సవం, తొమ్మిదో రోజు కల్పవృక్షవాహనం, పదో రోజు కామధేను వాహనం, చివరగా పదకొండో రోజు తెప్పోత్సవంతో ప్రత్యేక ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల సంధర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలంకరణలతో ఆలయం శోభాయమానంగా విరాజిల్లుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు