వక్షోజాలు చిన్నవిగా వుంటే పిల్లలకు సరిపడా పాలు అందవా...?
శనివారం, 21 అక్టోబరు 2017 (16:34 IST)
చంటి పిల్లలకు తల్లిపాలు ఇచ్చేటపుడు చాలామంది తల్లులకు అనేక అనుమానాలు, అపోహలు వుంటాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం.
వక్షోజాల ఆకృతి పెద్దగా వున్నవారికి పాలు ఎక్కువగా వుంటాయనీ, వక్షోజాలు చిన్నవిగా వుంటే పిల్లలకు సరిపడా పాలు అందవని చాలామంది అనుకుంటారు. కానీ ఇందులో నిజంలేదు. వక్షోజాల్లోని క్షీర నాళాలే పాల ఉత్పత్తికి తోడ్పడతాయి తప్ప వాటిలోనీ ఫ్యాటీ టిష్యూ కానేకాదు. అంటే వక్షోజాల పరిమాణంతో సంబంధం లేదు.
ప్రతి రెండు గంటలకోసారి బిడ్డకు పాలు పట్టాల్సిందే అని చాలామంది అనుకుంటారు. అది అన్నిసార్లు కాదు. ఇది ప్రతి పాపాయికీ ప్రత్యేకమే. కొందరికి ఆకలి వేయవచ్చు లేదా వేయకపోవచ్చు. కాబట్టి ప్రతి రెండు గంటలకోసారి పాలు పట్టాలని చూడకుండా పాపాయికి ఆకలి వేసినప్పుడే పాలు పట్టాలి.
పాపాయి పాలు తాగుతున్నప్పుడు లైంగికంగా కలిస్తే గర్భం రాదు అనుకోవడమూ అపోహే. ఆ సమయంలో కూడా కలిస్తే గర్భం వచ్చే అవకాశం లేకపోలేదు. వైద్యుల సలహాతో గర్భ నిరోధక పద్ధతులు పాటించాలి. ఒకవేళ నెలసరులు రాకుండా వుండి పాపాయి వయసు ఆరు నెలలు లోపు వుంటే గర్భం వచ్చే అవకాశం తక్కువగా వుంటుంది.
ఇక పాలు ఇస్తున్నప్పుడు మందులు తీసుకోకూడదని అంటుంటారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. ఎందుకుంటే మందుల ప్రభావం పాపాయిపై ప్రభావం చూపే అవకాశం వుంది. అందువల్ల మందులు వాడాల్సి వస్తే వైద్యుల సలహా తీసుకోవాలి.
తల్లిపాలు పడని పిల్లలు వుంటారా... అంటే చాలా అరుదుగా ఇలాంటి సమస్య రావచ్చు. కొందరు పిల్లలు పుడుతూనే హైపోఅలెర్జనిక్ సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటివారికి లాక్టోస్ రహితంగా వుండే పాలపొడి మిశ్రమాలు ఉపయోగపడుతాయి.
తల్లిపాలు సమృద్ధిగా రావాలంటే...
మామూలు కంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. ఆహారంలో కొంతవరకూ ద్రవ పదార్థాలు వుండేట్లు చూసుకోవాలి. పళ్లరసాలు, బార్లీ వంటివి.
అలాగే ఓట్స్, వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వెల్లుల్లిని తినడం ఇష్టం లేనివారు గార్లిక్ పిల్స్‌ని తీసుకోవచ్చు. క్యారెట్లు కూడా మంచిదే. ఇంకా పిండి పదార్థాలు, పొటాషియం పాళ్లు ఎక్కువగా వుండే పదార్థాలు తీసుకోవాలి.
రోజూ గుప్పెడు నట్స్ తీసుకుంటే వీటి నుంచి అందే కొవ్వులు, యాంటీ ఆక్సిడేంట్లు కొత్తగా తల్లైన వారికి ఎంతో మేలు చేస్తాయి.