మన దేశంలో గర్భిణీ స్త్రీలకు ఆహార నియమాల గురించి ఎన్నో రకాల అభిప్రాయాలున్నాయి. సాధారణంగా మన ఇండ్లల్లో స్త్రీలు గర్భం ధరించారని తెలియగానే వారు తీసుకునే ఆహారంపై కొన్ని నియమాలుంచుతారు. అలాగే ఫలానా ఆహార పదార్థాలు తప్పని సరిగా తీసుకోవాలి లేదా ఫలానా ఆహార పదార్థాలను తినకూడదు అని నిబంధనలు ఉంచుతారు మన పెద్దలు.
కొన్ని ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటే పుట్టబోయే పిల్లలు నల్లగా పుడుతారని చాలామంది అభిప్రాయపడుతుంటారు. కొన్ని వర్గాల ప్రజలు స్త్రీలకు కొన్ని రకాల పండ్లు కూరగాయలు వారికి ఆహారంగా ఇవ్వడం మానేస్తుంటారు.
ఉదాహరణకు గర్భిణీ స్త్రీలు అరటిపండ్లు తినకూడదంటారు. వారు అరటిపండ్లు తింటే పుట్టబోయే బిడ్డకు జలుబు-దగ్గులాంటి వ్యాధులు వచ్చి వారిని ఇబ్బంది పెడుతాయని భయాందోళనలకు గురి చేస్తుంటారు. ఇంకా చేపలు ఆహారంగా ఇచ్చేందుకుకూడా చాలామంది తిరస్కరిస్తారు. ఎందుకంటే పుట్టబోయే బిడ్డకు తెల్లటి మచ్చలు ఏర్పడుతాయని వారి అనుమానం.
గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన ఆహారం...!
గర్భిణీ స్త్రీలకు సమతుల్యమైన ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. వారికిచ్చే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్‌లు, మినరల్స్ ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు చివరి మూడు నెలల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్‌కు చెందిన మాత్రలను ఇవ్వాలంటున్నారు వైద్యులు. సహజంగా వారిలో ఇవి లోపిస్తుంటాయి.
అలా విటమిన్ల లోపంతో పుట్టబోయే పిల్లల్లో పెదాలు పగలడం, తలపై కురుపులు తదితర సమస్యలతో బాధపడతారు. ఇలాంటి సమస్యలనుంచి బయటపడేందుకు గర్భిణీ స్త్రీలు తమ ఆహారంలో పప్పుదినుసులు, బియ్యం, కాయగూరలు, రోట్టెలు, పండ్లు ఉండేలా చూసుకోవాలంటున్నారు వైద్యులు.
ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా పాలను సేవించాలి. గర్భస్థ శిశువు పెరిగే కొద్దీ తనకు కావలసిన ఆహారాన్ని తల్లి శరీరంనుంచి గ్రహించుకుంటుంది. దీంతో గర్భిణీ స్త్రీలు పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ ఉండేలా చూసుకోవాలి. ఇది అన్నిరకాల ఆహార పదార్థాలలో విటమిన్ బి రూపంలో లభ్యమవుతుంది. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్‌కు సంబంధించిన మాత్రలను వైద్యుల సలహా మేరకు వాడాలంటున్నారు వైద్యులు.