భైంసా "బడీఖాలా" సల్లంగుండాలె...!

శుక్రవారం, 31 అక్టోబరు 2008 (12:36 IST)
భైంసా అనే పేరును ఎక్కడో విన్నట్లుంది అనుకుంటున్నారు కదూ..! దుర్గాదేవి నిమజ్జనోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా, భైంసా గ్రామంలో ఇటీవల అల్లర్లు జరిగాయి కదా, ఆ ప్రాంతమే మనం పైన చెప్పుకున్న భైంసా. ఈ భైంసాలో "బడీఖాలా" అని ప్రేమగా, ఆప్యాయంగా పిల్చుకునే తుల్జాబాయిని ఓ శాంతిదూత అనవచ్చు.

"మతాలు, కులాలు ఏంది సార్. మానవత్వం అనేది ఉండాలె, నా కొడుకు, కోడలూ వద్దని మొత్తుకున్నా పరుగెత్తికెళ్లి చేతనైన సాయం చేశాను" అని చెప్పే ఈ పెద్దమ్మ చేసిన పని అంత సామాన్యమైనదేమీ కాదు. అల్లరిమూకల బారినుంచి ఓ ముస్లిం కుటుంబాన్ని కాపాడి, వారికి ప్రాణదానం చేసిందీమె.

ఎప్పట్లాగే ఆ ఊర్లో దుర్గాదేవి నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా, కోలాహలంగా జరుగుతున్నాయి. పిల్లలు, పెద్దల కేరింతలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఉత్సవాలను చూసేందుకు పెద్ద ఎత్తున జనం ఇళ్లల్లోంచి బయటికొచ్చి ఉత్సాహంగా చూస్తున్నారు. అంతా బాగానే ఉంది.

ఇంతలో ఏమైందో ఏమో... కత్తులు, గొడ్డళ్లు, గడ్డపారలు స్వైర విహారం చేస్తూ భయాన వాతావరణాన్ని సృష్టించాయి. ఏ రాయి వచ్చి ఎవరి తలను తాకుతుందో, ఏ కత్తి వచ్చి ఎవరి కడుపులో దిగబడుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. జనాలంతా ప్రాణాలరచేతిలో పెట్టుకుని భయం, భయంగా పరుగులు తీస్తున్నారు. ఇళ్లల్లోకెళ్లి తలుపులు, కిటికీలు మూసుకుని దాక్కున్నారు.

అల్లరిమూకలు ఊరుకుంటాయా.. ఒక ఇంటికి నిప్పుపెట్టి వికటాట్టాహాసాలు చేస్తూ, చేతికందినదాన్నల్లా ధ్వంసం చేస్తున్నారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి షాక్ తిన్న ఆ ఇంట్లోవారు మేం చేసిన తప్పేంటి దేవుడా..? అంటూ గుండెలవిసేలా దీనంగా రోదిస్తున్నారు. దీన్నంతంటినీ ఎదురింట్లోంచి మన బడీఖాలా చూసింది.

ఇంట్లో వాళ్లంతా వద్దని చెబుతున్నా పట్టించుకోని బడీఖాలా ప్రాణాలకు తెగించి, ప్రాణభయంతో బిక్కు బిక్కుమంటున్న ఆ ముస్లిం కుటుంబాన్ని రక్షించింది. తన ఇంట్లోకి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చి, వారికి ధైర్యం చెప్పింది. మనుషులకు మాత్రమే కులమతాలుగానీ, మానవత్వానికి కాదని ఆమె నిరూపించింది.

60 సంవత్సరాలు వయసున్న మన బడీఖాలా పూర్తి పేరు తుల్జాబాయి ఠాకూర్. లోకం పోకడ పెద్దగా తెలియని ఈమెకు పుట్టిల్లు, మెట్టిల్లు రెండూ భైంసానే. పదేళ్ల క్రితం భర్త చనిపోయిన ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. ఏళ్ల తరబడి ఒకే వీధిలో ఉంటుండటం వల్ల ఈమెకు ఆ ప్రాంతంలోని అన్ని కులాల, మతాలవారు బాగా ఎరికే. వాళ్లందరితోనూ ఈమె ప్రేమగా ఉండేది. వాళ్లు కూడా అంతే...!

ఎవరిళ్లలో ఏ శుభకార్యం జరిగినా ముందుండే మన బడీఖాలా... కాపాడిన ముస్లిం కుటుంబం వారికి కూడా ఆప్తురాలే. ఆ కుటుంబంలోని పిల్లలందరూ దాదిమా అని పిలుస్తూ, ప్రేమగా ఉండేవాళ్ళు. అలాంటి వారిని ఆపద సమయంలో వదిలిపెట్టి, నా స్వార్థం నేను ఎలా చూసుకుంటాను చెప్పండి? అంటుందీ పెద్దమ్మ.

"కులాలు, మతాలు కాదు... మానవత్వమే మిన్న" అంటూ భావితరాలకు కూడా ఒక తేజోవంతమైన స్ఫూర్తిని నూరిపోసిన మన పెద్దమ్మ, బడీఖాలా... మన అందరికీ ఆదర్శం. అల్లరిమూకల దాడికి బలవకుండా ఓ కుటుంబానికి ప్రాణం పోసిన బడీఖాలాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించనున్నారు. మనం కూడా మన పెద్దమ్మకు హ్యాట్సాఫ్ చెప్పేద్దామా...?!!

వెబ్దునియా పై చదవండి