మిషెల్ అడుగుజాల్లో నేటి మహిళలు

అమెరికాలోని ఉద్యోగినులు తమ దేశ ప్రథమ మహిళ మిషెల్ ఒబామాను ఆదర్శంగా తీసుకుంటున్నారు. కారణం ఓ వైపు కార్పోరేట్‌ న్యాయవాదిగా తన విధులు నిర్వర్తిస్తూ, ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ మరోవైపు రెండు సంవత్సరాలపాటు ఒబామా రాజకీయ ప్రచార కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచిన ఆమె అక్కడి ఉద్యోగినులకు ఆదర్శంగా నిలిచారు.

మిషెల్ ఒబామా గతంలో ఉద్యోగాలు చేసే తల్లులతో సమావేశాలు నిర్వహించి, ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడంతోపాటు పిల్లలను ఎలా పెంచాలి, వారి భవిష్యత్‌కు సంబంధించిన విషయాలపై ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆమె వారికి విశదీకరించేవారు. ఆమె చెప్పిన విషయాలను తన కుటుంబంలో ఆచరించి చూపారని అక్కడి మహిళలు అంటున్నారు.

ఇదిలావుండగా ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేసే తల్లిదండ్రులు పలు డిమాండ్లు చేస్తున్నారు. గుయానా, స్విట్జర్లాండ్‌, లిబేరియా దేశాల్లోలాగా అమెరికాలో కూడా వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.

అలాగే ప్రభుత్వమే శిశు సంరక్షణ కేంద్రాలను నిర్వహించడం లేదా అలవెన్సులు ఇవ్వడంలాంటివి చేయాలని వారు కోరుతున్నారు. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు తమ పిల్లలను సంరక్షణ కేంద్రాల్లో(క్రీచ్ సెంటర్) వదిలినందుకు నెలకు 1,500 డాలర్ల(సుమారు రూ.65 వేలు) వెచ్చించాల్సివస్తోందని వారు తెలిపారు. ప్రస్తుతం వారంతా మిషెల్‌పై ఆశలు పెట్టుకున్నారు.

వెబ్దునియా పై చదవండి