ఛేదించరాని పురుషుల దుర్గమ దుర్గాలు వరుసగా ఒక్కటొక్కటిగా ఛేదించబడుతున్నాయి. 'ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పింపగన్' అనేది చాలా పాత పద్యమే అయినప్పటికీ, ఈ పద్య సారాంశం ఇవ్వాళ అరబ్ దేశాల్లో అక్షరాక్షరమూ రుజువవుతూ మధ్యప్రాచ్యంలోనూ వెలుగులు విరజిమ్ముతోంది.
మధ్య ప్రాచ్య దేశాల న్యాయవ్యవస్థలో మహిళల పాత్రకు మరింతగా అవకాశమిస్తూ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో మొట్ట మొదటి మహిళా వివాహ రిజిస్ట్రార్‌ను నియమించింది. 33 ఏళ్ల ఫాతిమా సయ్యద్ ఒబైద్ అల్ అవానీ అబుదుబాయ్ న్యాయ శాఖలో వివాహ రిజిస్ట్రార్‌గా నియమించబడ్డారు
రాజ్యమేలలేమా.. స్వర్గానికి ఎగురలేమా...
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా.. ఉయ్యాలలూపే చేతులు రాజ్యాలేలగలవా... ఎంత పాత మాటలు, ఎంత కర్ణ కఠోరమైన డైలాగులు. మన కళ్లముందే ఇవి ఉనికిని కోల్పోతూ.. ఆకాశంలో సగం విశ్వరూపాన్ని విభ్రమతో తేరి పార చూస్తూ..
.
ఇలాంటి అత్యున్నత పోస్టుకు అరబ్ ప్రపంచంలో మహిళను ఎన్నుకోవడం ఇది రెండో సారి. ఇంతవరకు ఈజిప్టు మాత్రమే అరబ్ ప్రపంచంలో ఏకైక మహిళా వివాహ రిజిస్ట్రార్‌గా ఉంది. అల్ అవానీ ఇస్లామిక్ న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు. ఇద్దరు పిల్లల తల్లి.
అబుదుబాయ్ న్యాయ శాఖలో ఇద్దరు మహిళలు ప్రాసిక్యూటర్లుగా నియమించబడిన తర్వాత ఈమె సైతం మహిళా రిజిస్ట్రార్‌గా నియమించబడటం విశేషం. కాగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా ఖోలౌడ్ అల్ దహిర్ నియామకం గతంలో సంచలనం గొల్పింది.