నేనివ్వాళ మా అమ్మను అడిగాను...ఏంటంటే..! మా నానమ్మ ఇంట్లో అంటే తనకు అత్తగారిల్లు. ఇక్కడ ప్రతి ఒక్కరుకూడా అమ్మనే సలహాలు అడుగుతుంటారు. అది ఎలా సాధ్యం అని? ఇంటిల్లిపాది అమ్మకే ఎక్కువ గౌరవం ఇస్తుంటారు. కాని ఇలా ప్రతి ఇంట్లోనూ నేడు మనం చూడగలుగుతామా...!
దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి...! దీనికి మా అమ్మ చిరునవ్వుతో ఇలా అంది...నువ్వేం కంగారు పడకు. నీకు ఆ రహస్యాలేంటో చెబుతాను. నీవుకూడా మీ అత్తగారింట్లో అందరి చేత గౌరవం స్వీకరించేలా సూచిస్తాను. అత్తగారింట్లో ఎలా మెలగాలో నేను నీకుకూడా నేర్పిస్తాను. అత్తగారింట్లో ఎలా నడుచుకుంటే మనల్ని అందరూ గౌరవిస్తారో అలాంటి సూత్రాలను నేనుకూడా పాటించాను. కాబట్టే ఈ నాటికికికూడా అత్తగారింట్లో అందరిచేత మన్ననలు పొందుతున్నాని అమ్మ అంది.
ప్రతి తల్లిదండ్రులుకూడా తమ బిడ్డ అత్తగారింటికి వెళ్ళి అందలమెక్కాలని, వారి చేత గౌరవింపబడాలని కోరుకుంటుంటారు. ఇలా కోరుకోవడంలో తప్పు లేదు. ప్రతి చిన్న విషయానికి అత్తగారింటివారు తమ బిడ్డని సలహాలు అడిగి తీసుకోవాలనే కోరుకుంటుంటారు. దీనికి కొన్ని చిట్కాలు మీ అమ్మాయికి నేర్పండి. ఆ చిట్కాలు మీ అమ్మాయి తన అత్తగారింట్లో పాటిస్తే ఆమెకూడా మా అమ్మలాగే అందరి మన్ననలు పొంది గౌరవింపబడుతుందని ఆశిస్తాం.
ముఖ్యమైన విషయం ఏంటంటే వివాహం అయిన తర్వాత అమ్మాయి తన భర్తకు బానిసగా మారకూడదు. అతను మీ అమ్మాయికి జీవిత భాగస్వామి అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఆమె ప్రతి బాధ, ఆనందంలోనూ అతను పాలుపంచుకోవాలి. మనిషి జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని పంచుకునేందుకు సమాజంలో కోట్లమంది ఉంటారు. కాని ఒక స్త్రీ బాధను పంచుకునేందుకు కేవలం ఆమె భర్త అనేది అతను గుర్తెరిగేలా అమ్మాయి మసలుకోవాలి.
భార్యాభర్తల బంధం కొనసాగడమనేది వారి గౌరవానికి ప్రతీక. అలా ఇరువురుకూడా కలిసిమెలిసి జీవించేలా అమ్మాయి తల్లిగా మీరు తీసుకోవలసిన బాధ్యత. ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు వారిరువురి సమస్యను సానుకూలంగా వినే ఓపిక తల్లికే ఉంటుంది. తల్లిగా ఈ సమస్యను పెద్దదిగా చేయకుండా అక్కడికక్కడికే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. వీలైతే వారిద్దరితో కలిసి చర్చించి మీరే సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించండి.
ఇంట్లోని ప్రతి ఒక్కరి మాటను వినండి. వారి మాటకు విలువిచ్చేదానికి ప్రయత్నించండి. దీంతో మీపై వారికి గౌరవం పెరుగుతుంది. ఒకవేళ మీ ఇంట్లోని వారు చెప్పే విషయం ఏదైనా మంచిది కానప్పుడు వెంటనే దానిపై ప్రతిస్పందించకండి. నిదానంగా వారితో చర్చించేందుకు ప్రయత్నించి ఆ మాట, పనికి సంబంధించిన విషయంలోనున్న లోటుపాట్లను వారికి వివరించండి. దీంతో వారికి మీరు నచ్చజెప్పే విధానం ఆకట్టుకుంటుంది.
మరోవైపు మీ అమ్మాయి కాపురానికి వెళ్ళిన ఇంట్లో ఆడపడచుతో విబేధాలు తలెత్తితే, ఎవరైనా చెప్పుడు మాటలు విని వారిమధ్య సంబంధాలు బెడిసి కొట్టే సందర్భంలోకూడా సంయమనం పాటించేలా వారికి తర్ఫీదు ఇవ్వాలి. ఇలా చెప్పుడు మాటలు విన్నాకూడా వాటి గురించి వెంటనే ఎదుటి వారిని అడగకూడదు. కాస్త తెలివిగా వ్యవహరించి చెప్పుడు మాటలు చెప్పిన వారికి తగిన గుణపాఠం చెప్పేలా ప్రయత్నించాలి. దీంతో మళ్ళీ మీ ఇరువురిపై ఇతరులు చెప్పుడు మాటలు చెప్పేందుకు ఆస్కారం ఇవ్వకూడదు.
అత్తగారింట్లో మసలుకొనేటప్పుడు ప్రతి ఒక్కరి మాటను సానుకూలంగా వినండి. ఆ తర్వాతే వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆలోచించండి. వీలైనంతమేరకు మీ పొరపాట్లేమైనా ఉంటే వాటిని వెంటనే సరిచేసుకోవడానికి ప్రయత్నించండి.
మీ అమ్మాయికి వారి అత్తగారింటి బంధాన్ని బలపరచుకునేలా తర్ఫీదు ఇవ్వండి. ఎందుకంటే తను జీవితాంతం అక్కడే గడిపేది. కాబట్టి తన కుటుంబంలోని వారందరినీ గౌరవించేలా నేర్పండి. బంధాలకు గౌరవం ఆపాదించేలా ప్రయత్నించేందుకు తర్ఫీదు ఇవ్వండి. మీరు సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అమ్మాయి కాపురం సజావుగా ఉంటుంది. కుటుంబంలోని ప్రతి సభ్యునికి వీలైనంతమేరకు సహాయం చేయాలని చెప్పండి. కేవలం పెద్దలకు సేవలు చేయడమే కాదు చిన్నవారికి సహాయం చేసే అలవాటునుకూడా నేర్పించండి. దీంతో మీ అమ్మాయి తన అత్తింటివారి నోట్లో నాలుకలా మారిపోతుందనడంలో సందేహంలేదు.
తన వస్తువులు ఇతరులకు పంచే అలవాటు చేయండి. దీంతో వారి వస్తువులు మీ అమ్మాయి వాడేందుకు వారుకూడా సుముఖత వ్యక్తం చేస్తారు. మన దేశంలోని ప్రతి కుటుంబంలోనూ వారివారి అలవాట్లు, వ్యవహారాలు, సంప్రదాయాలు వేరువేరుగా ఉంటాయి. ప్రతి అమ్మాయికూడా తన తల్లివద్ద నేర్చుకున్న సంప్రదాయాలనే పాటించేందుకు ఇష్ట పడుతుంది.
కాని ప్రతి చిన్న విషయానికి తల్లిగారింటిగురించి గొప్పగా చెప్పి అత్తగారింటిని కించపరిచేలా ఉండకూడదు మీ అమ్మాయి వ్యవహారం. ఇలా చేస్తే ప్రతి అమ్మాయికూడా తన అత్తగారింట్లో కూడా తన ఇంట్లో ఉన్నట్లే స్వతంత్రంగా ఉండగలదు. అలాగే అత్తగారింట్లో ఆమె విలువ మరింత పెరుగుతుంది.