దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళ లోక్‌సభకు సభాపతిగా ఎన్నిక కానుంది. ఆమె మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీన్ రామ్ కుమార్తె. పేరు మీరా కుమార్. ఎంఏ, ఎల్.ఎల్.బి, పట్టభద్రురాలైన ఈమె ఇండియన్ ఫారిన్ సర్వీసెస్(ఐఎఫ్ఎస్)కు సెలక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఐఎఫ్ఎస్‌ను వదులుకుని రాజకీయాలలోకి వచ్చారు.
ఈమె... బీహార్ రాష్ట్రంలోని ససారం లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 1985వ సంవత్సరంలో తొలిసారిగా బిజ్నూర్ లోక్‌సభ స్థానంనుంచి బరిలోకి దిగిన ఆమె విజయం సాధించి, లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1996, 1998లలో ఆమె ఢిల్లీ కరోల్ నియోజకవర్గంనుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో సహాయ మంత్రిగా చేరిన ఆమె 2004లో బీహార్‌లోని ససారాం నుంచి ఎన్నికై సాధికారత, సామాజిక న్యాయశాఖ మంత్రిగా పని చేశారు.
ఇంద్రప్రస్థ కాలేజీ, మిరండా హౌస్, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఆమె న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, ప్రభుత్వ ఉద్యోగినిగా సేవలు అందించారు. విదేశీ వ్యవహారాల శాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. 1990-92, 1996-99లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, 1999-200, 2002-2004లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా పని చేశారు.
1996-98 మధ్య కాలంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీలోనూ, దేశీయ వ్యవహారాల కమిటీ, విద్య, ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి మహిళా సాధికారతపై నియమించిన సంయుక్త సంఘంలోనూ సభ్యురాలిగా విధులు నిర్వహించారు.
2004లో నాలుగోసారి పార్లమెంట్‌కు ఎన్నికైన ఆమె.. మన్మోహన్ కేబినెట్‌లో సామాజిక న్యాయం, సాధికారత శాఖామంత్రిగా పని చేశారు. స్పానిష్‌లో అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సును చేశారు. ఇదిలావుండగా దళితురాలైన ఆమె తన పదవికి న్యాయం చేకూరుస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
రాజకీయంగా లబ్దిపొందేందుకు ఓ దళిత స్త్రీని స్పీకర్‌గా నియమిస్తే కాంగ్రెస్ పార్టీకి అటు ఉన్నత వర్గమైన బ్రాహ్మణులు, మైనారిటీలైన ముస్లింలు, దళితుల ఓటు బ్యాంకును రానున్న స్థానిక ఎన్నికలలో విజయం సాధించే వీలుందని పార్టీ భావిస్తోంది.
తొంభై దశకంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నత వర్గాలైన బ్రాహ్మణులు, ముస్లింల ఓటుబ్యాంకును పోగొట్టుకుంది. వీటితో బాటు బాబ్రీ మసీదును కొల్లగొట్టడంతో ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలలో ముస్లింల ఓట్లను పొందలేకపోయింది. దీంతోబాటు దళితుల ఓటు బ్యాంకునుకూడా పోగొట్టుకుంది. ఈ రెండు వర్గాలుకూడా అటు జనతాదళ్, బీజేపీ, బీఎస్‌పీకి అధికారాన్ని అందించాయి. ప్రస్తుతం ముస్లిం వర్గాలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని విడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ భావిస్తోంది.
ఇకపోతే దళితులుకూడా తమకు అనుకూలంగా బీఎస్‌పి అధినేత్రి మాయావతి తగిన న్యాయం చేయలేదనేది వారిలోని నిరాశ కొట్టొచ్చినట్లు కనపడుతొంది. గత ఎన్నికలలో ఆమె గెలిచినాకూడా తమకు ఎలాంటి న్యాయం చేయలేదనేది వారి వాదన. దీంతో రానున్న స్థానిక ఎన్నికలలో దళితులను తమవైపుకు తెచ్చుకునేందుకు దళిత వర్గానికి చెందిన మహిళను అత్యున్నత స్థానమైన సభాపతి పదవిని అప్పగిస్తే వారి ఓట్లనుకూడా పార్టీకి లబ్ది చేకూరేటట్లు ప్రణాళికలను రచించింది. దీంతో మాయావతిని అధికారంలోకి రానీయకుండా ఉంచేందుకు పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
కాగా గతంలో దళితుడైన పీ.ఏ సంగ్మా లోక్‌సభ స్పీకర్‌గా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. ప్రస్తుతం మీరా కుమార్ తన పదవికి న్యాయం చేసి తన వర్గాలకు చేరువయ్యేందుకు దోహదపడగలదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీంతో దళితులు, ఇతర వర్గాలు కాంగ్రెస్ పార్టీపట్ల మొగ్గు చూపగలవని కాంగ్రెస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేసాయి.