నమ్మిన సిద్ధాంతాన్ని వీడని రాజశేఖరుడు

శుక్రవారం, 4 సెప్టెంబరు 2009 (18:53 IST)
File
FILE
తాను నమ్మిన బాటను ఏనాడూ వీడని స్థైర్యం ఉన్న నేత వైఎస్‌.రాజశేఖర్ రెడ్డి. ప్రజలకు తానిచ్చిన, చేసిన బాసలు, హామీలను నెరవేర్చేందుకు ఎంతో కష్టమని తెలిసినా.. అసాధ్యమని ఎందరు వారించినా మడమతిప్పకుండా అధికారికంగా ప్రకటించే నేత వైఎస్. ప్రజా సంక్షేమం కోసం ఎంత భారాన్నైనా భుజస్కంధాలపై మోసేందుకు వెనుకంజ వేయని వ్యక్తి.

ఆ గుండె ధైర్యమే రెండు రూపాయలకు కిలో బియ్యం, విద్యుత్‌ రుణాలు మాఫీ, రైతుల బకాయిలు మాఫీ, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు, వ్యవసాయ బీమా ఇలా ఎన్నెన్నో పథకాలను ధైర్యంగా ప్రకటించి అమలు చేశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో కూడా రైతులకు మరో హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇస్తున్న ఏడు గంటల విద్యుత్‌ను తొమ్మిది గంటలకు పెంచనున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ హామీ నెరవేర్చకుండానే ఆయన తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు.

అంతేకాకుండా తన ప్రత్యర్థి కోరితే.. పని చేసి పెట్టమని తన అనుచరులకు ఆదేశాలు ఇచ్చే మనస్తత్వం వైఎస్‌ది. ఇలా.. ఎన్నో ఉదాత్తమైన లక్షణాలే ప్రజల్లో వైఎస్‌ను ధీశాలిగా, మహానేతగా చేశాయి. 1999లో వైఎస్‌కు ముఖ్యమంత్రి పీఠం అందినట్టే అంది చేజారింది. ఇక చంద్రబాబును ఓడించడం ఎవరితనం కాదు.. అనే మాటలు వినిపించాయి.

అయితే, వైఎస్ మాత్రం ఓటమితో కుంగిపోకుండా.. తనలో మరింత పట్టుదల, కసిని పెంచుకున్నాడు. ప్రజల కష్టసుఖాల్లో మమేకమయ్యాడు. ఇందుకోసం అనితరసాధ్యమైన వందలాది కిలోమీటర్ల మహా పాదయాత్రను చేపట్టారు. ఈ పాదయాత్ర రాజశేఖరుని చరిత్రను తిరగరాసింది.

ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నారు. వారితో మమేకమయ్యారు. దీని ఫలితమే.. తాను కలలుగన్న ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక వైఎస్‌లో ప్రస్పుటమైన మార్పు కనిపించింది. మునుపటి ఆవేశం ఆయన నుంచి క్రమేపి దూరమైంది.

రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టాక 'ప్రజల కోసమే ఇక ఈజీ వితం' అనే నిశ్చితాభిప్రాయానికి వచ్చి ఆ కోణంలో పరిపాలన సాగించారు. అదే ఆయనను కోట్లాది మంది ప్రజల హృదయాలకు మరింత చేరువచేసింది. రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు.

వెబ్దునియా పై చదవండి