వైఎస్సార్ ఉంటే తెలంగాణా సమస్య వచ్చేది కాదా...?

WD
వైఎస్సార్.. ఈ పేరు చెబితే ప్రతిపక్షాల గుండె గుభేల్. 2004లో సీఎం పీఠాన్ని అధిష్టించింది మొదలు తుదిశ్వాస విడిచేవరకూ ఆయనంటే విపక్షాలకు ఓ పెద్ద సవాల్. ముఖ్యంగా వైఎస్సార్ హయాంలో తెలంగాణా రాష్ట్ర సమితి పూర్తిగా బలహీనమై లేవలేని స్థితిలో కొట్టుమిట్టాడింది.

ఒక దశలో తెరాస పార్టీ సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టనున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అంతేనా అటు తెలుగుదేశం.. ఇటు ప్రజారాజ్యం పార్టీల నుంచి సభ్యులను క్రమంగా ఆకర్షించేస్తారని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. దీన్ని నిజం చేస్తూ తెరాస నుంచి విజయశాంతి, తెలుగుదేశం నుంచి రోజా బయలుదేరారు కూడా. ఇలా ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నద్ధమయ్యారంటే ఆయన ప్రభావం ఎంతటిదో అర్థమవుతుంది.

ఇక ప్రత్యేక తెలంగాణా అంశం... 2009 ఎన్నికల సమయంలో ఒకవైపు తెలుగుదేశం- తెరాస- వామపక్షాలన్నీ కలిసి మహాకూటమి పేరుతో ప్రత్యేక తెలంగాణాకు కట్టుబడి ఉంటామని చెప్పి ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చారు. అయితే వైఎస్సార్ మాత్రం తనది సమైక్యవాదమనీ సీమాంధ్రలో ప్రకటించి సంపూర్ణ మెజారిటీ సాధించి మరోసారి కాంగ్రెస్ పార్టీకి పీఠాన్ని కట్టబెట్టారు. తద్వారా తెలంగాణావాదం ప్రజలలో లేదనీ, కేవలం కొందరు రాజకీయ నిరుద్యోగులు సృష్టించిన గందరగోళమని వైఎస్సార్ అప్పట్లో బహిరంగంగా చెప్పారు.

తెలంగాణాలో వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్రంలో ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలను తొలగించాలని ఆయన కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా ఆయన జలయజ్ఞం పేరిట ప్రాజెక్టులను మొదలుపెట్టారు. అదేవిధంగా పేదలకు ఇందిరమ్మ గృహాలు, పావలా వడ్డీకి రుణాలు... ఇలా చెప్పుకుంటే పోతే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో.. అలా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పౌరునికి మెరుగైన జీవితాన్ని అందించడం ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని ఆయన కలలు కన్నారు.

ఇలా మొత్తంగా చూస్తే ఆయన లక్ష్యం సమైక్యాంధ్ర. ఆ దిశగానే ఆయన యత్నాలు సాగాయి. కానీ నేడు ఆయన లేని లోటు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన గతించి పట్టుమని మూడు నెలలు కూడా గడవక మునుపే రాష్ట్రం నిట్టనిలువునా చీలే పరిస్థితి దాపురించింది. ఇటువంటి దురదృష్టకర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్నదానిపై కేంద్ర సర్కార్ దృష్టి సారించింది.

వెబ్దునియా పై చదవండి