చావుకు వాళ్లంటే భయమేనట. వీళ్లను మాత్రం చావు కోరివరిస్తుందట. వాళ్ల గొప్ప ఏమిటి.. వీళ్ల తక్కువేమిటి?

గురువారం, 13 ఏప్రియల్ 2017 (05:22 IST)
భర్త ముందు చనిపోవడం, భార్య తర్వాత చాలాకాలం బతికి తీరుబడిగా కన్నుమూయడం మన కుటుంబాల్లో చూస్తూనే ఉంటాం. నూటికి 99 శాతం కుటుంబాల్లో ఇదే పరిణామం కనిపిస్తూ ఉంటుంది. మనదేశంలోనే  కాదు.. ఆర్థికాభివృద్ధిలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న దేశాల్లో కానీ.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్న దేశాల్లో కానీ మరణం స్త్రీపురుషుల మధ్య ఈ వివక్షను ఇదే తేడాతో సాగిస్తూనే ఉంది. ప్రాంతం ఏదయినా, దేశం ఏదయినా స్త్రీలే ఎక్కువ కాలం బతుకుతున్నారనేది.. ఆయా దేశాల అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అన్ని రకాల చావుల్లోనూ పురుషులే ముందున్నారనేది సర్వేలు చెబుతున్న అంశం. స్త్రీల కంటే ముందుగానే పురుషుల ఆయువు తీరిపోతోందనీ, దీనికి చాలా కారణాలున్నాయనీ పరిశోధకులు చెబుతున్నారు.
 
పురుషుడి కంటే స్త్రీ ఇంట్లో, సమాజంలో కూడా ప్రతిక్షణం మనగలగడానికి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉంది. అయినా ఈ అన్ని ఒత్తిడులను అధికమంచి ఆమె ఎక్కువ కాలం జీవించడానికి బలమైన కారణం ఉందట. అదేమిటంటే. ఎలాంటి ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని ఇస్తాయో మహిళలు తెలుసుకుని పాటిస్తుంటారట. అంతేకాకుండా ఏ చిన్న రోగం వచ్చినా దాన్ని తగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారట. ఒక్కపూట అన్నం తినకుంటే పురుషులు నీరసించిపోతుంటారు. కానీ వారానికి ఓ రోజు ఉపవాసం పేరిటో, డైటింగ్ పేరిటో ఆహారానికి దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని హ్యాండ్‌బాగుల్లో వేసుకు తిరుగుతున్న మహిళల సంఖ్య తక్కువేమీ కాదు.
 
ఏ అనారోగ్య సమస్యకు ఎలాంటి పద్ధతులు అనుసరిస్తే ఉపశమనం లభిస్తుందో మహిళలకు తెలిసినంతగా పురుషులకు తెలియదు. అనారోగ్యం వస్తే స్త్రీలు పట్టించుకున్నంతగా పురుషులు పట్టించుకోరు. చిన్నదేలే.. తగ్గిపోతుందిలే అంటూ కాలయాపన చేస్తారు. ఇలాంటివే కొన్ని సందర్భాల్లో పురుషులకు ప్రాణాంతకంగా మారుతుంటాయి. స్త్రీలు మితంగా తింటారు. బయటి తిండికి వారు చాలావరకూ దూరం. మిర్చిలు, బజ్జీలు అంటూ బయట దొరికే ఆయిల్‌ఫుడ్‌ను వారు ఎక్కువగా తినరు. కావాలంటే ఇంట్లోనే చేసుకుంటారు. ఇంట్లో చేసుకున్నా, కుటుంబ సభ్యులందరితో కలిసి తింటారు కాబట్టి మితంగానే తింటారు. పండ్లు ఎక్కువగా తింటుంటారు. లావు అవుతున్నామని గ్రహించినా, శరీరంలో కొవ్వు పెరిగిపోతోందని తెలిసినా వెంటనే తక్షణ చర్యలు తీసుకుంటారు. 
 
ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యకరమైన అలవాట్లు స్త్రీలకు ఎన్నో ఉన్నాయి. కానీ పురుషులు అలా కాదు.. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలు, బయట చిరుతిండి.. కాఫీ, టీలు లెక్కకుమించి తాగేయడం, సిగరెట్, పాన్, గుట్కా, మందు అలవాట్లు ఎన్నో ఉంటుంటాయి. ఒకవేళ ఇలాంటి అలవాట్లు లేకున్నా మానసిక ఒత్తిడి వారిని వేధిస్తుంటుంది. ఇవే అనారోగ్యానికి మెట్లని గ్రహించేలోపే జరగరాని ఘోరం జరిగిపోతుంటుంది.
 
పురుషుల్లో ఉండే గుణాలు కూడా వారి అకాల మరణాలకు కారణాలవుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, గొప్పగా చెప్పుకోవడానికి బాటిల్స్‌కు బాటిల్స్ బీర్లు లాగించేయడం, చిన్న రోగాలకు కూడా భయపడితే సమాజంలో చిన్నచూపు చూస్తారని భావించి.. ఆసుపత్రులకు వెళ్లకపోవడం వంటివి మగాడిని అని చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ.. అవి కాస్తా వికటిస్తే భూమిపై నూకలు చెల్లినట్లే. రోడ్లను దాటేటప్పుడు కూడా.. స్త్రీలు ఓ పద్ధతి ప్రకారం వెళ్తే.. రోడ్లు ఎంత రద్దీగా ఉన్నా పురుషులు ఆవలివైపుకు దూసుకెళ్తుంటారు. ఇలా ఒకటా రెండా.. ప్రతిదాంట్లోనూ దూకుడు చూపిద్దామనుకోవడమే పురుషుల కొంపముంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
 
ఒత్తిడిలో ఉన్నప్పుడు జీవితం గురించి నిర్ణయాలు తీసేసుకుని ఉసురు తీసుకుంటున్నవాళ్లలో పురుషులే ఎక్కువగా ఉన్నారని బోస్టన్‌లోని కానర్స్ సెంటర్ ఫర్ విమెన్స్ హెల్త్ డైరెక్టర్ జిల్ల్ గోల్డ్‌స్టెయిన్ చేసిన సర్వేలో తేలింది. వివిధ కారణాల వల్ల మానసిక ఒత్తిడి తీవ్రతరమై, మరణించాలని మగాళ్లు నిర్ణయించుకుంటున్నారట. అంటే మగాడికి మించి ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ దాని బారిన పడకుండా తప్పంచుకోవడం మహిళ అత్యంత చురుకుగా ఉండటమే ఆమె అధిక ఆయుష్షుకు అసలు కారణమని అంటున్నారు
 
మగాళ్ల జీవరహస్యం, మరణ రహస్యం కూడా వాళ్ల చేష్ట్యలలోనే ఉందని అర్థమైంది కదూ.. ఇక మీ ఇష్టం మరి.

వెబ్దునియా పై చదవండి