ఓలా, ఉబర్ పీక్ చార్జీల పేరుతో బాదేస్తున్నాయా... ఇదిగో పరిష్కారం

గురువారం, 7 జులై 2022 (20:08 IST)
‘‘తాడేపల్లి నుంచి పోరంకి వెళ్లానికి ఓలా క్యాబ్ బుక్ చేశాను. నేను వెళ్లాల్సిన చోటు 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బుక్ చేస్తున్నప్పుడు అందులో రూ.325 చూపించింది. తీరా క్యాబ్ వచ్చేసరికి అది రూ. 415కు పెరిగింది. ఇలా ఎందుకు జరిగింది? అని అడిగితే ట్రాఫిక్ టైమ్ కదా అంతే అని డ్రైవర్ చెప్పారు. దిగినప్పటికి ఎంత అవుతుందోననే భయపడ్డాను. ఈ చార్జీ చూస్తే కిలోమీటరుకు దాదాపు 47 రూపాయలు అయింది. ఒక్కోసారి దూర ప్రాంతాలకు వెళితే ఈ క్యాబ్స్ చార్జీలు విమానాల టికెట్లను మించిపోతున్నాయి ’’ అని సివిల్ సప్లయిస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే పి. శ్రావణి తన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు.

 
కేవలం విజయవాడలో మాత్రమే కాదు. హైదరాబాద్, దిల్లీ.. ఇలా ఏ నగరానికి వెళ్లినా చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఓలా, ఉబర్ లాంటి క్యాబ్ సర్వీసులతోపాటు కొన్ని సంస్థల డెలివరీ ఛార్జీలు కూడా పీక్ అవర్స్ పేరుతో పెంచేస్తుంటారు. రెగ్యులర్‌గా ఉండే ఛార్జీ కన్నా కొన్ని సమయాల్లో అదనంగా డబ్బులు వసూలు చేస్తుంటారు. దసరా వంటి పండుగ సందర్భాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లో ఇలాంటి వసూళ్ల పర్వం కనిపిస్తుంటుంది. వర్షం కురుస్తుందనే కారణం చూపించి కూడా అదనపు ఛార్జీ అవుతుందని కొందరు క్యాబ్ డ్రైవర్లు చెబుతుంటారు. ఇలాంటి సమస్య ప్రభుత్వం దృష్టికి రావడంతో దిల్లీ ప్రభుత్వం కొత్త విధానం అమలులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై నిర్దిష్ట మొత్తానికి( బేస్ ఛార్జ్) రెట్టింపు వసూళ్లు చేపట్టేందుకు అవకాశం లేకుండా దిల్లీ ప్రభుత్వం ఈ నిబంధనలు తీసుకొస్తోంది. నిర్ణయించిన మొత్తాలు మాత్రమే అన్ని వేళలా వసూలు చేసేలా మార్పులు తీసుకొస్తోంది. దీనివల్ల అదనపు వసూళ్లకు అవకాశం ఉండదని ప్రభుత్వం చెబుతోంది.

 
ఇప్పటికే పలు సమస్యలు
ఓలా, ఉబర్ సర్వీసుల విషయంలో ఇప్పటికీ అనేక సమస్యలను వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. క్యాబ్ బుక్ చేసిన తర్వాత కొన్నిసార్లు డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పటికీ వినియోగదారుడికి ఛార్జ్ వేస్తున్నారు. లొకేషన్‌కి సమీపంలో ఉండి క్యాన్సిల్ చేస్తే దాని భారం యాప్ వినియోగదారులు చెల్లించాల్సి వస్తోంది. కొన్ని సార్లు లొకేషన్ గురించి తెలుసుకున్న డ్రైవర్లు ఆ మార్గంలో ట్రాఫిక్ ఉంటుందని, ఇతర అనేక కారణాలు చూపించి రైడ్ క్యాన్సిల్ చేస్తున్నారు. క్యాష్ కాకుండా ఓలా అమౌంట్ ఇస్తామని చెబితే కూడా పలుమార్లు రైడ్ రద్దు చేసుకుంటున్న సందర్భాలున్నట్టు అనేక మంది ఫిర్యాదులు చేశారు. దీనిపై సోషల్ మీడియా ద్వారా కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 
కొన్ని రూట్లలో తమకు రిటర్న్ సర్వీసు ఉండదనే కారణంతో కూడా డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. డ్రైవర్లు పదేపదే క్యాన్సిల్ చేయకుండా వారికి ముందుగానే డెస్టినేషన్ తెలిసేలా చేస్తున్నట్టు ప్రకటించాయి. కస్టమర్ క్యాష్ ఇస్తారా లేక ఆన్‌లైన్ పేమెంట్ చేస్తారా అనేది కూడా ముందుగానే డ్రైవర్‌కు చెబుతామని ఓలా అంటోంది. తద్వారా డ్రైవర్‌కు ఇష్టమైతే రైడ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు లేదంటే రైడ్ అంగీకరించే పరిస్థితి ఉండదని చెబుతోంది. కస్టమర్‌ను పిక్ చేసుకోవాల్సిన లోకేషన్ దూరంగా ఉంటే అందుకు కూడా డబ్బులు చెల్లించే మోడల్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామంటోంది ఉబర్. రైడ్లను మాటిమాటికి క్యాన్సిల్ చేయకుండా డ్రైవర్లకు ఇన్‌సెంటివ్స్ కూడా ఇస్తున్నామంటోంది ఆ సంస్థ. పీక్ అవర్స్‌లో అదనపు మొత్తం వినియోగదారులకు భారం అవుతుందనే అంశంలో నిబంధనలకు అనుగుణంగానే ఛార్జీలుంటున్నాయని ఓలా, ఉబర్ కూడా వివరణ ఇచ్చాయి.

 
విమాన ఛార్జీల కన్నా ఎక్కువేనా
విజయవాడ సమీపంలోని పోరంకి వెళ్లడానికి కిలోమీటర్‌కు రూ. 83 చొప్పున వసూలు చేసినట్టు ఉద్యోగిని శ్రావణి అనుభవం చెబుతోంది. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లడానికి సాధారణంగా రూ.3 వేల నుంచి రూ. 4వేల మధ్యలో విమానం టికెట్ ఉంటోంది. అంటే దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖకి కిలోమీటర్‌కు రూ.10 నుంచి రూ.13 అవుతుండగా విజయవాడ నగరంలో ప్రయాణానికి మాత్రం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఆమె అంటున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు విమాన ఛార్జీతో పోల్చినా సగటున వివిధ నగరాల్లో ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసులు కిలో మీటర్‌కు వసూలు చేసే ఛార్జీ అనేక రెట్లు అదనంగా ఉంటుంది.

 
విజయవాడ నుంచి ఏలూరు వెళ్లాలంటే ఓలా క్యాబ్ సెడాన్ రూ. 2,800కి తగ్గకుండా వసూలు చేస్తోంది. అదే ఛార్జీతో హైదరాబాద్‌కి విమానంలో వెళ్లవచ్చు. అంటే 60 కిలోమీటర్ల క్యాబ్ ఛార్జ్‌తో పోలిస్తే 240 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి విమాన ఛార్జ్ తక్కువని చెప్పవచ్చు. ఈ ధరల నియంత్రణ మీద దిల్లీ ప్రభుత్వం చొరవ తీసుకుని నియంత్రణ విధించడం ఆహ్వానించదగ్గ విషయమని మంగళగిరికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వీఎన్ సూర్య అన్నారు.

 
‘‘క్యాబ్ సర్వీసు ఛార్జీలు ఎప్పుడు, ఏ రీతిలో ఉంటాయో అర్థం కావడం లేదు. తెలియకుండానే జేబుకు చిల్లుపడుతోంది. వాటిని నియంత్రించడం అవసరం. ఓలా, ఉబర్ సర్వీసుల విషయంలో సమస్యలను చాలాసార్లు ఆయా సంస్థలకు తెలియజేశాం. కానీ తగిన స్పందన లేదు. ఇప్పుడు దిల్లీ ప్రభుత్వం తీసుకున్న చొరవ ఉపయోగకరం. అన్ని చోట్లా ప్రభుత్వాలు ఇలాంటి అదనపు వసూళ్ల పర్వానికి అడ్డుకట్ట వేస్తే మేలు జరుగుతుంది’’అని ఆయన బీబీసీ వద్ద తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

 
మాకు పిర్యాదులు లేవు..
ఓలా, ఉబర్ వంటి క్యాబ్‌లలో అదనపు మొత్తం వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు తమ వరకూ రాలేదని ఏపీ రవాణా శాఖ అదనపు కమిషనర్ ఎస్‌ఏవీ ప్రసాదరావు తెలిపారు. "రవాణా శాఖ పరిధిలోకి వచ్చే ప్రతీ వాహనం నిబంధనలు పాటించాలి. వాటిని ఉల్లంఘించినట్టు మా దృష్టికి రాగానే స్పందిస్తున్నాం. ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ సహా ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించేలా ప్రత్యేక డ్రైవ్‌లు కూడా నిర్వహిస్తున్నాం. క్యాబ్‌లు కూడా అదనపు వసూళ్లకు పాల్పడడానికి వీలులేదు. ఆధారాలతో ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రయాణీకులకు తగిన భద్రతతో పాటుగా, వారి నుంచి వసూలు చేసే ఛార్జీల విషయంలో తగిన విధంగా వ్యవహరించేలా చూస్తాం"అని ఆయన బీబీసీకి వివరించారు. దిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం పరిశీలిస్తామని ఆయన అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు