బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారం

సోమవారం, 20 జనవరి 2020 (19:29 IST)
"మీరు ఒలింపిక్స్ పతకం ఎందుకు కోరుకుంటున్నారు" అని ఒక రిపోర్టర్ నన్ను అడిగారు. "నేను నా జీవితాంతం, ప్రతి రోజూ కష్టపడింది కేవలం దానికోసమే అన్నా" - పి.టి.ఉష. ఇది ఒక క్రీడారుడికి క్రీడలు, ముఖ్యంగా ఒలింపిక్స్ ఎంత ప్రధానం అనేది మనకు చెబుతుంది. 2020 జులై 24 నుంచి టోక్యో ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కాబోతున్నాయి.

 
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులందరూ జులై ఒలింపిక్స్‌ కోసం సన్నద్ధమవుతున్నారు. 2000 తర్వాత భారత్ మొత్తం 13 ఒలింపిక్ పతకాలను గెలుచుకుంది. వాటిలో మహిళలు 5 పతకాలు సాధించారు. దీనికి పూర్తిగా భిన్నంగా 20వ శతాబ్దంలో దేశం గెలిచిన మొత్తం 13 పతకాలూ పురుషులు గెలిచినవే. ఇంతకుముందెప్పుడూ లేని విధంగా ఇప్పుడు మొదటిసారి బీబీసీ భారత భాషల వెబ్‌సైట్‌లో ఒక ప్రత్యేక పేజీని ప్రారంభిస్తోంది.

 
భారత క్రీడల్లో తిరుగులేని భాగస్వామ్యాన్ని అందించిన మహిళా క్రీడాకారుల కోసం ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందించబోతోంది. ఈ ప్రత్యేక పేజీ భారత మహిళా క్రీడాకారుల గురించి అత్యంత స్ఫూర్తివంతమైన కథనాలను, క్రీడల్లో అసమానతలకు వ్యతిరేకంగా వారు ఎదుర్కున్న సమస్యలు, అవరోధాలను అందిస్తుంది. మా ప్రయత్నం వెనుక భారతదేశంలో క్రీడలు, మహిళల గురించి చర్చ జరగాలనే ఉద్దేశం కూడా ఉంది.

 
వీటితోపాటు మార్చి 2020లో మొట్టమొదటిసారిగా బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్- 2019ని ప్రకటించనున్నారు. ఫిబ్రవరిలో ఈ పురస్కారానికి వచ్చిన నామినేషన్లను వెల్లడిస్తారు. భారత క్రీడల్లో మహిళా క్రీడాకారుల అపార సహకారాన్ని గౌరవించడమే దీని లక్ష్యం. భారతదేశంలోని మహిళా క్రీడాకారులు సాధించిన విజయాలకు సంబరాలు చేసుకోడానికి ఇది ఒక అవకాశం.

 
భారత మహిళా క్రీడాకారుల విజయాల గురించి చెప్పుకుంటే, 2016లో రియో ఒలింపిక్స్‌లో సాక్షి మలిక్, పీవీ సింధు దేశానికి రెండు పతకాలు అందించారు. సాక్షి ఒలింపిక్స్‌లో భారత్‌కు కుస్తీలో మొట్టమొదటి పతకం సాధించిపెడితే, పీ.వి.సింధు భారత్ తరఫున అత్యంత పిన్నవయస్కురాలైన ఒలింపిక్ విజేతగా నిలిచారు. భారత్‌కే చెందిన దీపా కర్మాకర్‌ కూడా ఒలింపిక్ పతకం తృటిలో చేజార్చుకున్నారు.

 
భారత మహిళా క్రీడాకారులు లేకుంటే 1992 ఒలింపిక్స్‌లో లాగే, భారత్ రియో ఒలింపిక్స్ నుంచి కూడా వట్టి చేతుల్తో స్వదేశానికి వచ్చుండేది. అంతకు ముందు జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో కూడా భారత్ ఆరు పతకాలు గెలుచుకుంది. వీటిలో భారత మహిళా క్రీడాకారులు రెండు సాధించారు. వీటిలో మేరీకోమ్ సాధించిన భారత బాక్సింగ్ ఒలింపిక్ పతకం కూడా ఉంది. ఇది బాక్సింగ్‌లో భారత్ గెలిచిన మొట్టమొదటి పతకం.

 
2012లో రెండో ఒలింపిక్ పతకం గెలిచిన సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్‌లో మొదటి ఒలింపిక్ పతకం గెలిచిన ఇండియన్‌గా చరిత్ర సృష్టించింది. మహిళా క్రీడాకారుల విజయాల చుట్టూ పెద్దగా చర్చ జరగకపోయినా, దేశ క్రీడల్లో భారత మహిళల భాగస్వామ్యాన్ని ఇవి చాపిస్తాయి.

 
ఈ అవార్డు ఎందుకు?
2020 టోక్యో ఒలింపిక్స్ ముందు, మహిళలు, యువతకు క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని పెంచాలనే బీబీసీ ప్రయత్నంలో "బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్-2019" అవార్డు ఒక భాగం. బీబీసీ భారత భాషల సేవల హెడ్ రూపాఝా దీనిపై మాట్లాడుతూ "చాంపియన్స్ అయ్యే ముందు మహిళలు ఎన్నో అవరోధాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాకు చాలా ఉద్వేగంగా ఉంది. మేం మొదటిసారి ప్రారంభిస్తున్న అవార్డు ఇది. నా మనసుకు చాలా నచ్చింది. మనం ఎంతోమంది మహిళా క్రీడాకారులు సాధించిన అద్భుత విజయాలను హైలైట్ చేయడం చాలా ముఖ్యం. కానీ, ఆ క్రీడల్లో రాణించేందుకు వారు ఎదుర్కొన్న భారీ సవాళ్లను కూడా హైలైట్ చేయాలి. మా ఈ చొరవకు అండగా నిలవాలని, 2019 బెస్ట్ స్పోర్ట్స్ వుమెన్‌కు ఓటు వేయాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను" అన్నారు.

 
విజేతను ఎలా ఎన్నుకుంటారు?
బీబీసీ ఎంపిక చేసిన జ్యూరీ భారత మహిళా క్రీడాకారులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. జ్యూరీలో భారత దేశంలోని కొందరు ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, రచయితలు ఉంటారు. జ్యూరీ సభ్యుల నుంచి అత్యధిక ఓట్లు సంపాదించిన టాప్ 5 మహిళా క్రీడాకారులు బీబీసీ వెబ్‌సైట్లలో పబ్లిక్ ఓటింగ్ కోసం నామినేట్ అవుతారు.

 
షార్ట్ లిస్ట్ అయిన ఈ ఐదుగురు మహిళా క్రీడాకారుల పేర్లను ఫిబ్రవరిలో వెల్లడిస్తారు. ఏ బీబీసీ భారత భాషల వెబ్‌సైట్‌లోకి అయినా వెళ్లి, జాబితాలో తమకు నచ్చిన మహిళా క్రీడాకారిణికి అభిమానులు ఓటు వేయవచ్చు. అత్యధిక ఓట్లు వచ్చిన క్రీడాకారిణి 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్-2019' అవుతారు. విజేతను సన్మానించడానకి మార్చిలో దిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు.

 
దీనితోపాటు అదే వేదికపై భారత క్రీడలకు అసాధారణ సేవలు అందించిన ఒక క్రీడాకారిణికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా అందిస్తారు. ఈ అవార్డు కార్యక్రమానికి ముందు బీబీసీ భారత్‌లోని వివిధ నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వివిధ నగరాల్లో ఉన్న విద్యార్థులను, ప్రజలను చేరి, మహిళా క్రీడాకారులు సాధిస్తున్న విజయాలపట్ల వారిలో అవగాహన కల్పించడానికి ఇది మా ఆలోచన.

 
భారత మహిళా క్రీడాకారుల భాగస్వామ్యం
మహిళా క్రీడాకారుల భాగస్వామ్యం విషయానికి వస్తే గత ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన 57 పతకాల్లో, దాదాపు సగం(28) మహిళా అథ్లెట్లు గెలుచుకున్నవే. భారత్‌ను రెండు సార్లు ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్‌కు తీసుకెళ్లిన ఒకే ఒక భారత క్రికెట్ కెప్టెన్(పురుషులు, మహిళలో) మిథాలీ రాజ్ ఒక్కరే. స్మృతి మంధానా, హిమా దాస్, మను బకర్, రాణీ రాంపాల్, సానియా మీర్జా, దీపికా పల్లికల్ ఇలా దేశానికి వన్నె తెచ్చిన మహిళా క్రీడాకారుల జాబితా చాలా పెద్దది.

 
ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బ్రేక్ తీసుకున్న సానియా మీర్జా మళ్లీ తన మొదటి అంతర్జాతీయ టైటిల్ గెలుచుకోవడంతో, వినేష్ పొగట్ రోమ్‌లో 53 కేజీల కుస్తీ విభాగంలో బంగారు పతకం సాధించడంతో ఈ ఏడాది ప్రారంభమైంది. ఈ విజయాలన్నీ భారత్‌లో మహిళా క్రీడాకారుల గేమ్ మారుతోంది అనేది సూచిస్తోంది. ఈ మారుతున్న గేమ్‌లో భాగం కావడానికి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్ మీకు అవకాశం అందిస్తోంది.

 
అందుకే, మీ అభిమాన క్రీడాకారిణి 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-2019" అవార్డు గెలుచుకునేలా సాయం చేయడానికి ఫిబ్రవరిలో మీ ఫేవరెట్ బీబీసీ వెబ్‌సైటుకు వెళ్లడం మర్చిపోకండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు