ప్రభుత్వానికి తన గళం వినిపించడానికి ఫ్రాన్స్‌లో ఒక నటి ఒక బహిరంగంగా అవార్డుల వేడుకలో తన దుస్తులు విప్పేశారు. కరోనా మహమ్మారి సమయంలో కళను, సంస్కృతిని కాపాడడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఒక సందేశం ఇచ్చారు. 57 ఏళ్ల కొరెన్ మాసిరో సీజర్ అవార్డుల కార్యక్రమం వేదికపై ఇలా చేశారు. ఫ్రాన్స్‌లో సీజర్ అవార్డులను ఆస్కార్‌కు సమానంగా భావిస్తారు.
మాసిరో అవార్డుల వేదికపైకి గాడిదను తలపించేలాంటి కాస్ట్యూమ్ కప్పుకొని వచ్చారు. దాని లోపల ఆమె రక్తంతో తడిచినట్లు ఉన్న ఒక డ్రెస్ వేసుకుని ఉన్నారు. తర్వాత ఆమె ఆ రెండింటినీ విప్పేసి నగ్నంగా నిలుచున్నారు. ఫ్రాన్స్‌లో సినిమా హాళ్లు మూతపడి మూడు నెలలు దాటింది. ప్రభుత్వం వాటిని తెరవాలనే నిర్ణయం తీసుకోకపోవడంతో చాలామంది కళాకారులు అసంతృప్తితో ఉన్నారు.
సీజర్ అవార్డుల కార్యక్రమ నిర్వాహకులు బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డ్ ఇవ్వడానికి మాసిరోను వేదికపైకి పిలిచారు. కానీ, వేదికపైకి రాగానే, తన డ్రెస్ విప్పేసిన మాసిరో కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులందరినీ షాక్ ఇచ్చారు. ఆమె శరీరంపై కొన్ని సందేశాలు రాసి ఉండడం కూడా కనిపించింది. ముందువైపు పొత్తి కడుపుపై ఆమె "సంస్కృతి లేకుంటే, భవిష్యత్తు లేదు" అని రాసుకుని వచ్చారు.
వీపు మీద "మాకు మా కళను తిరిగివ్వండి, జాన్" అని రాసుకుని ఫ్రాన్స్ ప్రధానమంత్రి జాన్ కాస్టెక్స్‌కు ఆమె మరో సందేశం కూడా ఇచ్చారు. ఈ వేడుకలో మాసిరో నగ్నంగా మారడానికి ముందు, మరికొంతమంది కళాకారులు కూడా ప్రభుత్వానికి ఇలాంటి అప్పీలు చేశారు. "నా పిల్లలు జారా స్టోర్‌లో షాపింగ్ చేయడానికి వెళ్లచ్చు, కానీ వాళ్లు సినిమా చూడ్డానికి మాత్రం వెళ్లకూడదు. ఇదేంటో నాకు అర్థం కావడం లేదు" అని సీజర్ అవార్డుల్లో బెస్ట్ స్క్రీన్‌ప్లే పురస్కారం గెలుచుకున్న స్టెఫనీ డెమాస్టియర్ అన్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో వందలాది కళాకారులు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినీ విమర్శకులు సినీరంగానికి సంబంధించిన ఇంకా చాలామంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పారిస్‌లో నిరసన ప్రదర్శనలు చేశారు. మిగతా ప్రాంతాలపై ఎత్తివేసినట్లే, సినిమా హాళ్లు, కళా వేదికలపై కూడా నిషేధం ఎత్తివేయాలని, వాటిని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు.