ఒకవైపే చూడూ... రెండోవైపు చూడాలనుకోకు... మాడిపోతావ్: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

సోమవారం, 20 మే 2019 (21:25 IST)
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు. ఒకవేళ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే అది ఇరాన్ 'ముగింపు'నకు దారి తీస్తుందన్నారు. "ఇరాన్‌‌‌కు యుద్ధం కావాలి అంటే అది ఇరాన్‌కు అధికారిక ముగింపు అనే లెక్క, ఇంకెప్పుడూ అమెరికాను బెదిరించొద్దు" అని ఆదివారం ట్రంప్ ఘాటుగా ట్వీట్ చేశారు.
 
ఇటీవలి కాలంలో గల్ఫ్ తీరంలో అమెరికా అదనపు యుద్ధనౌకలను మోహరించింది. ట్రంప్ తాజా ట్వీట్‌తో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చేలా కనిపిస్తున్నాయి. ఇరాన్‌తో గొడవ యుద్ధరూపం దాల్చకూడదు అని కొద్దిరోజుల క్రితం ట్రంప్ తన సహాయకులకు చెప్పారు. కొద్దిరోజుల క్రితం ఇరాన్‌తో యుద్ధావకాశాల గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానమిస్తూ "పరిస్థితి అంతవరకు రాకూడదని ఆశిస్తున్నాం" అని అన్నారు.
 
ఇటీవల ఇరాన్ కూడా యుద్ధావకాశాలను కొట్టిపారేసింది. "యుద్ధం జరిగే పరిస్థితి లేదు. మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు. అలాగే, ఇరాన్‌ని ఈ ప్రాంతంలో ఎదుర్కొనే శక్తి కూడా ఎవరికీ లేదు" అని ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జవాద్ జరిఫ్ ఇరాన్ రాష్ట్ర మీడియాతో అన్నారు.
 
ఈ ఉద్రిక్తతలకు కారణం ఏంటి?
2015లో కుదిరిన ఇరాన్ అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి 2018లో అమెరికా వైదొలిగింది. ఇరాన్ తన అణు కార్యక్రమానికి ముగింపు పలికితే, ఆ దేశంపై విధించిన ఆంక్షలను అమెరికా సడలించాలన్నది ఆ ఒప్పందం లక్ష్యం. అయితే, ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంతో పాటు, ఇరాన్ కూడా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా వారం క్రితం అణు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది.
 
ఇరాన్ ఒప్పందంలో "లోపాలు" ఉన్నాయంటూ ట్రంప్ ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలను మళ్ళీ విధించారు. గల్ఫ్ తీరంలో నౌకలపై క్షిపణులను ఇరాన్ మోహరించిందని వచ్చిన ఆరోపణలను ఆ దేశం తోసిపుచ్చింది. ఇరాన్‌కు అణుబాంబు దొరక్కుండా చూడాలని ఐక్యరాజ్యసమితిని ట్రంప్ కోరారు.
 
గల్ఫ్‌లో ఏం జరుగుతోంది?
ఇటీవలి కాలంలో అమెరికా తన విమాన వాహక నౌక యు.ఎస్.ఎస్ అబ్రహం లింకన్‌ను ఈ ప్రాంతంలో మోహరించింది. అలాగే 1,20,000 మంది దళాలను మిడిల్ ఈస్ట్‌కు పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికా తన దౌత్య సిబ్బందిని ఇరాక్ వదిలి రావాలని ఆదేశించింది. డచ్, జర్మన్ దళాలు కూడా ఈ ప్రాంతంలో మిలిటరీ శిక్షణను నిలిపివేశాయి.
 
ఆదివారం వచ్చిన వార్తల ప్రకారం బాగ్దాద్‌లోని అత్యంత సురక్షిత ప్రాంతంలో ఒక క్షిపణి దూసుకొచ్చిందని ఇరాక్ మిలిటరీ తెలిపింది. ఈ ప్రాంతంలోనే పలు దేశాల ఎంబసీలు, ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు ఉంటాయి. ఆ క్షిపణి అమెరికా ఎంబసీ సమీపంలోని ఒక పాత భవనాన్ని ఢీకొందని వార్తలు వచ్చాయి. అయితే, ఈ దాడిలో ఎవరు మరణించలేదని తెలిపింది.
 
అలాగే, సౌదీ అరేబియాలోని ఒక పైపులైన్ మీద ఇరాన్ డ్రోన్‌తో దాడి చేయించిందని సౌదీ అరేబియా ఆరోపించింది. ఈ దాడిని ఇరాన్ ఆదేశాల మేరకు హూతీ తిరుగుబాటుదారులు చేశారని ఆరోపించింది. అయితే, ఆ ఆరోపణలను ఇరాన్ కొట్టిపారేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు