నల్లమల అడవులు.. వండర్ ఆఫ్ నేచర్...

గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:17 IST)
తూర్పు కనుమల్లో ఒక భాగంగా ఉన్న నల్లమల అడవులు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని 5 జిల్లాల్లో(మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కడప, కొద్ది మేర నల్గొండ జిల్లాలలో) విస్తరించి ఉన్నాయి. నల్లమల కొండల సరాసరి ఎత్తు 520 మీ వీటిలో 923 మీ ఎత్తుతో బైరానీ కొండ, 903 మీటర్ల ఎత్తుతో గుండ్ల బ్రహ్మేశ్వరం కొండ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ అడవుల్లో పులులు సమృద్దిగా ఉండటం వలన ఈ ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. ఇది మన దేశంలోనే అతి పెద్ద పులుల సంరక్షణాకేంద్రం. టైగర్ సఫారీ పేరిట ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారు నల్లమల అడవిలో స్వేచ్ఛగా తిరగాడే జంతువులను, పులులను పర్యాటకులకు చూపిస్తారు. నల్లమల అడవులు ఆధ్యాత్మిక పరంగా, ప్రకృతిపరంగా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. 
 
ఈ దట్టమైన అడవిలో గుళ్ళు, గోపురాలు, జలపాతాలకు లెక్కలేదు. అడవుల్లో దాగి ఉన్న కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలంటే దేవుడు కనిపిస్తాడు. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. అలాంటి జలపాతాలలో ఒకటి సలేశ్వర జలపాతం. ఇది శ్రీశైలం అడవులలోని ఒక ఆదిమవాసి యాత్రా స్థలం. మండు వేసవిలో జాలువారే జలపాతాలు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నీటిగుండాలు ఎంతో ఆకట్టుకుంటాయి. శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది సలేశ్వరం. అడవిలో నుంచి 25 కిలోమీటర్ల ప్రయాణం వుంటుంది. 
 
ఇందులో 20 కిలోమీటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది అక్కడి నుండి 5 కిలోమీటర్ల కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. లోయలో ఉన్న గుహలో లింగం ఉంటుంది. శ్రీశైలం మల్లికార్జునస్వామి, సలేశ్వర లింగమయ్యస్వామి, లుండి మల్లన్న, ఉమామహేశ్వరం ఈ 4 లింగాలే అందరికీ తెలిసినవి. ఐదవ లింగం నల్లమయ్య, అడవులలో ఎక్కడ ఉందో ఇప్పటికీ రహస్యమే. ఇక్కడ సంవత్సరంలో ఐదు రోజులు మాత్రమే అడవిలోకి అనుమతిస్తారు. 
 
సలేశ్వర క్షేత్రం మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల అడవిలో ఉంది. ఆకాశ గంగను తలపించే మహత్తర జలపాతం ఇక్కడ ఉంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి చాల మంచిది. గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగం ఉంది. 
 
సలేశ్వరం జాతర సంవత్సరానికి ఒకసారి చైత్ర పౌర్ణమికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరగడం వల్ల కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు "వత్తన్నం వత్తన్నం లింగమయ్యో" అంటు వస్తారు. వెళ్లేటప్పుడు "పోతున్నం పోతున్నం లింగమయ్యో" అని అరుస్తూ నడుస్తుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు