దేశ వ్యాప్తంగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ కారణంగా పసిడి అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ప్రభావం దిగుమతులపై పడింది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. కానీ, బంగారం రేట్లు మాత్రం ఆకాశానికి పెరిగిపోయాయి. ఎక్కువమంది పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడులు పెట్టడంతో వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి.
ఈ ప్రభావం మన దేశంలోనూ కనిపించింది. ఒక గ్రాము బంగారం ధర రూ.58 వేల నుంచి రూ.60 వేలకు పలికింది. అలా ఒక్కసారిగా బంగారం, వెండి ధరలకు రెక్కలు రావడంతో ఒకవైపు అమ్మకాలు పడిపోగా, మరోవైపు, దిగుమతులు కూడా దారుణంగా పడిపోయాయి.
గత నాలుగు నెలల్లో 56.5 శాతం తగ్గి 68.53 కోట్ల డాలర్ల (దాదాపు 5,185 కోట్లు)కు క్షీణించాయి. ఫలితంగా వాణిజ్య లోటు అదుపులోకి వచ్చింది. గతేడాది ఇదేకాలంతో పోలిస్తే 5,940 కోట్ల డాలర్ల నుంచి 1,395 కోట్ల డాలర్లకు తగ్గింది.
నిజానికి మార్చి నుంచే పసిడి దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి మార్చిలో బంగారం దిగుమతులు 62.6 శాతం, ఏప్రిల్లో 99.93 శాతం, మేలో 98.4 శాతం, జూన్లో 77.5 శాతం తగ్గాయి. జులైలో మాత్రం స్వల్పంగా పుంజుకుని 4.17 శాతం పెరిగాయి.
మరోవైపు, బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడంతో అమ్మకాలు కూడా పడిపోయాయి. గతేడాది ఏప్రిల్ - జులై మధ్యతో పోలిస్తే ఈ ఏడాది అదేకాలంలో భారత్ నుంచి ఆభరణాల ఎగుమతులు 66.36 శాతం తగ్గి 417 కోట్ల డాలర్లకు పడిపోయాయి.