భారీగా పెరగనున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధర?

సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (13:15 IST)
కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం సబ్సిడీని భారీగా తగ్గిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికి పెట్రోలియం సబ్సిడీకి కేటాయింపుల్ని మూడింట రెండొంతులు తగ్గించింది. గతంలో పెట్రోలియం సబ్సిడీ రూ.40,915 కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం రూ.12,995 కోట్లు మాత్రమే కేటాయించింది. ఓవైపు ఉజ్వల స్కీమ్ లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే కోటి మంది లబ్ధిదారులు ఉన్నారు. 
 
మరోవైపు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలో కోత విధిస్తోంది. దీంతో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధర భారీగా పెరిగే అవకాశముంది. సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కేటాయింపుల్ని తగ్గిస్తోంది. ఒకేసారి కాకుండా దశలవారీగా సబ్సిడీని తగ్గించనుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో కిరోసిన్, వంట గ్యాస్ ధరలు కూడా దశలవారీగా పెరిగే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. 
 
అలాగే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సిలిండర్ ధర రూ.125 పెరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో రెండు సార్లు రూ.50 చొప్పున, ఫిబ్రవరిలో రూ.25 సిలిండర్ ధర పెరిగింది. సామాన్యులకు మూడు నెలల్లో గ్యాస్ సిలిండర్ మరింత భారమైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు