టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (TBAL) హైదరాబాద్‌లోని అత్యాధునిక కేంద్రం నుండి బోయింగ్ 737 విమానం కోసం వర్టికల్ నిలువు ఫిన్ నిర్మాణాన్ని రవాణా చేసింది. బోయింగ్ 737 ఎయిర్ క్రాఫ్ట్‌లో అమర్చేందుకు వర్టికల్ ఫిన్ రెంటన్, డబ్ల్యూఏ లోని బోయింగ్ తయారీ కేంద్రానికి డెలివరీ చేయబడుతుంది.
ప్రపంచం కోసం భారతదేశంలోని ఏరోస్పేస్, డిఫెన్స్‌లో సమీకృత వ్యవస్థల సహ-అభివృద్ధికి, దేశం యొక్క ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రతిబింబించడం పట్ల బోయింగ్ నిబద్ధతకు టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఒక ఉదాహరణ. మొదటి వర్టికల్ ఫిన్ తయారు చేయబడిన వేగం, నాణ్యత టీబీఏఎల్ యొక్క నైపుణ్యం కలిగిన సిబ్బంది, ఇంజనీరింగ్ ప్రతిభ, ప్రపంచ స్థాయి తయారీ సామర్థ్యాలకు నిదర్శనం అని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే అన్నారు.
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుకరన్ సింగ్ మాట్లాడుతూ, “బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ కోసం మొదటి వర్టికల్ ఫిన్ స్ట్రక్చర్‌ను విజయవంతంగా రవాణా చేయడం టీబీఏఎల్ లోని బృందాల కృషి, తిరుగులేని సహకారం ఫలితంగా చోటుచేసుకుంది. ఇది మొత్తం బోయింగ్ కార్య కలాపాలలో టీబీఏఎల్ మరియు భారతదేశాన్ని ఒక ముఖ్యమైన తయారీ స్థావరంగా ఉంచింది. నాణ్యత, సకాలం లో డెలివరీపై బలమైన దృష్టితో దేశీయ అంతరిక్ష తయారీ పురోగతికి మేం కట్టుబడి ఉన్నాం” అని అన్నారు.
వర్టికల్ ఫిన్ అనేది విమానం తోకపై అమర్చే వర్టికల్ స్థిరీకరణ ఉపరితలం. ఇది స్థిరత్వం, నియంత్రణను అందిస్తుంది. కొత్త ఉత్పత్తి శ్రేణి అత్యాధునిక రోబోటిక్స్, ఆటోమేషన్, తయారీ ప్రక్రియలలో పూర్తిస్థాయి డిటర్మినెంట్ అసెంబ్లీ వంటి అధునాతన ఏరోస్పేస్ భావనలను ఉపయోగించుకుంటుంది. బోయింగ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్(TASL)లకు చెందిన ఈ జాయింట్ వెంచర్ 14,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నెలకొంది. 900 మంది ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇది బోయింగ్ యొక్క AH-64 అపాచీ హెలికాప్టర్ కోసం ఏరో-స్ట్రక్చర్‌లను ఉత్పత్తి చేస్తోంది. ఇందులో ఫ్యూజ్‌లేజ్‌లు, సెకండరీ స్ట్రక్చర్‌లు, ప్రపంచవ్యాప్త వినియోగదారుల కోసం వర్టికల్ స్పార్ బాక్స్‌లు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో, టీబీఏఎల్ భారత సైన్యం యొక్క AH-64 Apache అటాక్ హెలికాప్టర్ కోసం మొదటి ఫ్యూజ్‌లేజ్‌ను కూడా పంపిణీ చేసింది.